మంత్రి కొండా సురేఖ.. ప్రస్తుతం ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ అవుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆధిపత్య పోరు, గ్రూపు గొడవలతో రాజకీయంగా విమర్శలపాలవడంతో పాటు వ్యక్తిగత, ఇతర విషయాల్లోనూ తలదూర్చి తరచూ ‘వివాదాస్పద మంత్రి’గా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆమె చేసిన కామెంట్లు, చేష్టలపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం మనుమరాలి పుట్టినరోజు వేడుక సందర్భంగా ‘బీరు.. బిర్యానీ’ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ నేపథ్యంలో మినిష్టర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరిస్తుండడంపై అంతటా చర్చనీయాంశమవుతోంది.
– వరంగల్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
దేవాదాయ శాఖ మంత్రి సురేఖ వరుస వివాదాలతో చర్చనీయాంశంగా మారుతున్నారు. పరిపాలన పరంగా, పార్టీలో, వ్యక్తిగతంగా ఆమె మాటలు, చేష్టలే అందుకు కారణమవుతున్నాయి. తాజాగా మనుమరాలి బర్త్ డే పార్టీ సందర్భంగా ‘బిర్యానీ ఉంటే బీరు ఉంటది. బిర్యానీలు నడుస్తున్నయి. అట్లనే సల్లవడుడు నడుస్తున్నది. ఎక్కువ డ్యాన్స్ చేసిన వాళ్లకు మందు ఎక్కువ’ అంటూ మంత్రి మాట్లాడిన వీడియో కాల్ వైర ల్ కాగా, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గు రువారం రాత్రి నుంచి ఈ వీడియో అన్ని సోష ల్ మీడియాల్లో బాగా చక్కర్లు కొట్టాయి. అయి తే కుటుంబ, ప్రైవేట్ ఫంక్షన్ల విషయమే అయి నా.. వీడియోలు వైరల్‌గా మారడంతో మంత్రి పై విమర్శలు పెరుగుతున్నాయి. ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి తగినట్లుగా వ్యవహరించాలని, ప్రైవేట్ ఫంక్షన్ అయినా ఇలా మాట్లాడడం సరికాదని అంటున్నారు.
పరిపాలన పరంగా ఉమ్మడి జిల్లాలోని మరో మంత్రి సీతక్కతో కొండా సురేఖకు మొదటినుంచీ పొసగడం లేదు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఒకరి నియోజకవర్గంలో మరొకరు అడుగుపెట్టలేనంతగా వరకు వెళ్లింది. మంత్రు లు సీతక్క, కొండా సురేఖ మధ్య విభేదాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతర నుంచే తీవ్రమయ్యాయి. దేవాదాయ శాఖ మం త్రిగా జాతరలో కీలకంగా వ్యవహరించాల్సిన కొండా సురేఖ.. ముఖ్యమంత్రి వచ్చిన ఒక్కరోజు మాత్రమే వెళ్లి వచ్చారు. వరంగల్ నగరం లో కొత్తగా నిర్మించిన ధార్మిక భవనంలో మేడారం ఈలయ ఈవో ఆఫీసు కేటాయింపు, మేడారం జాతర పూజారుల నిరసన అంశాలు పరిపాలన పరంగా సురేఖపై విమర్శలకు కారణమయ్యాయి. దేవాదాయ మంత్రిగా కొండా సురేఖ ఆలయాల దర్శనానికి వెళ్లినప్పుడు అక్క డి నియమాల ఉల్లంఘనతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ పరంగా సురేఖ వైఖరి విమర్శలకు కారణమవుతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెలేలు కొం డా సురేఖపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ సెగ్మెంట్లలో పార్టీపరంగా గ్రూపులకు కారణమవుతున్నారని పలువురు ఎమ్మెల్యేలు కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశా రు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మం త్రి కొండా సురేఖ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయి. రెండు వర్గాల కార్యకర్తలు కొ ట్టుకోవడం దాకా వెళ్లింది.దసరా సందర్భంగా గీసుగొండ మండలం ధర్మారంలో పెట్టిన ఫ్లెక్సీ లో స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై మొదలైన వివాదం తీవ్రమైన విషయంగా మారింది. కొండా సురేఖ మంత్రి హోదాలో ఉండి ఆటో లో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడం, అక్కడ పోలీసుల తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన తర్వాత కాంగ్రె స్ అధిష్టానం కొండా సురేఖతో మా ట్లాడింది. ఇతర సెగ్మెంట్లలో జోక్యం చేసుకోవద్దని సూచిం ది. తొలుత సినీనటుడు నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ జరుగుతున్నది.