తొర్రూరు, ఫిబ్రవరి 4 : విభిన్న సంస్కృతులకు నిలయమైన తెలంగాణలో అనాదిగా వస్తున్న కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, పండుగలు జాతరలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. ప్రజలు వాటిని ఇప్పటికీ ఆచరిస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నారు. ఇందులో ఒకటి గొల్లల ఆరాధ్య దైవమైన శ్రీలింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి కొలువైన గొల్లగట్టు జాతర. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ జాతర దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా అవతరించింది. సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి పెద్దగట్టు వద్ద రెండేళ్ల కోసారి ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు ప్రధాన పూజారులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామానికి చెందిన తండు వంశస్తులు. జాతరకు 15రోజుల ముందు 32 దేవతావిగ్రహాలతో కూడిన బైకానిపెట్టె(దేవరపెట్టె)ను సంప్రదాయ పూజల నడుమ తండు వంశస్తులు మహాయాత్రగా తీసుకెళ్తారు. సుమారు 500 ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతున్నది. ఆదివారం నుంచి మొదలయ్యే ఈ మహాజాతరకు ప్రధాన పూజారులు బైకానిపెట్టెతో రెండు రోజుల ముందే బయల్దేరారు.
‘దిష్టి’తో జాతర ఆరంభం..
దిష్టి కార్యక్రమంతో జాతర మొదలవుతుంది. ఆనవాయితీ ప్రకారం జాతరకు 15రోజుల ముందే గొల్ల పూజారులైన తండు, మట్ట వంశీయులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లింగా.. ఓ లింగా.. అంటూ దేవరపెట్టెతో ఊరేగింపుగా బయల్దేరారు. దారి పొడవునా నీరాజనాలతో గ్రామగ్రామాన యాదవ భక్తులు దేవరపెట్టెకు కొబ్బరికాయలు కొడుతూ నీళ్లు ఆరబోసి భక్తిని చాటుకున్నారు. సూర్యాపేట పురవీధుల్లోనూ ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు, భక్తులు దేవరపెట్టెకు ఘనంగా స్వాగతం పలుకగా, రాత్రికి కేసార గ్రామానికి చేరుకున్నారు. అక్కడ లింగమంతుల స్వామి గుడి హకుదారులు వారి ఇంటి వద్ద దేవుడిగుడిలో దేవరపెట్టెను భద్రపరుస్తారు. ఆదివారం సాయంత్రం దేవరపెట్టెను పూలు, పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు చేస్తారు. స్థానిక ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, యాదవ భక్తులు, హకుదారులు వైభవంగా దేవరపెట్టెను కావడితో మోసుకుంటూ లింగమంతుల స్వామి కొలువైన పాలచెర్లయ్య గుట్టపైకి తీసుకెళ్లి ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో పెడుతారు.
జాతర జరిగే విధానం..
మొదటి రోజు ఆదివారం ఉదయం మిరియాల గ్రామం నుం చి గుడారం హకుదారులైన మట్ట వంశీయులు గుడారానికి పూజలు చేసి లింగమంతుల స్వామిని గుట్టపైకి తీసుకెళ్తారు. వారిని తెరచీరల గొల్ల పూజారులు, తెలుసూరి గొల్ల పూజారులు అని కూడా పిలుస్తుంటారు. వారికి పూర్వకాలం నుంచి యాదవులు గ్రామాల్లో చేసే వివిధ జాతర్లకు గుడారం వేసి గంగమ్మ పటము ప్రదర్శించి కథలు చెప్పే ఆచారం వస్తున్నది. వారు శ్రీలింగమంతుల స్వామి జాతరలో పెద్దగట్టుపై కూడా గుడారం వేసే హకు ఉంటుంది. గుడారం అంటే జాతరలు, పండుగలు జరిగే ప్రదేశంలో తెలుసూరి బైకాన్ని పూజారులకు ఎండ, వానకు రక్షణగా ఉంటూ ప్రత్యేకమైన దేవతల చిత్రాలతో ముద్రించి ఉంటుంది. ఈ గుడారం కింద కథలు చెప్పడం, పట్నాలు వేయటం, దేవరపెట్టె, వివిధ సంగీత వాయిద్యాలు వీరణాలు, తాళాలు, గజ్జలు వంటి సామగ్రిని భద్రపరుస్తారు. అదేరోజు సూర్యాపేట చంద్రన్నకుంట వల్లపు వంశీయులు మకరతోరణం హకుదారులు మధ్యాహ్నం లింగమంతులస్వామి జాతరకు చేరుకుంటారు.
కాసింపేట యాదవ హకుదారులు పసిడికుండలు తీసుకుని జాతరకు వస్తారు. రాత్రి కేసారం నుంచి దేవరపెట్టెను అలంకరించి వీరణాల బేరీల గజ్జెల శబ్దాలతో గుట్టపైకి తీసుకొస్తారు. బంతిపూలతో అలంకరించి గంపలో కొత్తకుండ, బియ్యం, పసుపు, కుంకుమ పూజా సామగ్రితో లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లి దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు, దీనినే ‘గంపల ప్రదక్షిణ’ అంటారు. రెండో రోజు దేవరపెట్టి ముందుపోలు ముంతలను అలంకరించి ముద్రపోలు వేసి మూడు బోనాలు(మైలబోనం, రాసిబోనం, సన్నవసర బోనం)లను దేవతలకు చెల్లిస్తారు. మూడు గొర్రెల(వరదగొర్రె, బద్దెగొర్రె, బారిగొర్రెను(గావు)ను బలి ఇస్తారు. మూడో రోజు చంద్రపట్నం వేసి ముగ్గులతో పసుపు, కుంకుమ, పిండితో అలంకరించి మాణిక్యమ్మ, లింగమంతుల స్వామి కల్యాణం కథ చెబుతారు.
పొడుపు గొర్రెని పొడవడం, జాగిలాలు చేయడం, వరదపాశం వండడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నాలుగో రోజు పలక ముగ్గు కొట్టి నెలవారపట్నం మీద మేకను బలిస్తారు. బోనం వండి ఏక్సర్ముద్ద వేసి రాత్రి వరకు దేవరపెట్టెను కేసారం గ్రామానికి చేరుస్తారు. ఐదో రోజు మకరతోరణానికి యాదవ హకుదారులు పూజలు నిర్వహించి వారి ఇంటి (సూర్యాపేట)కి తీసుకెళ్తారు. పసిడి కుండలను కాసింపేట హకుదారులు తమ గ్రామానికి తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది. కాగా, ఈ మహాజాతరలో పూజలు చేసే తండు వంశస్తులకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. రానున్న సంవత్సరం పెద్దగట్టు జాతరకు ముందు చీకటాయపాలెం కూడా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.