మద్దతు ధరతో రైతుల నుంచి నేరుగా యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. దశల వారీగా కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం రాయపర్తి మండల కేంద్రంలో జిల్లాలో తొలి కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే మరిన్ని కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఐదు సెక్టార్ల ద్వారా యాసంగి ధాన్యం రవాణాకు నిర్వహించిన టెండర్లను పౌరసరఫరాల సంస్థ అధికారులు ఖరారు చేశారు. జిల్లాలో 1,86,707 టన్నుల ధాన్యం కొనుగోలుకు 46,67,675 గోనె సంచులు అవసరం కాగా, 6,15,000 సంచులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి సెంటర్లో ప్యాడీక్లీనర్, తేమ కొలిచే, తూకం వేసే యంత్రాలను అందుబాటులో ఉంచుతున్నారు.
వరంగల్, ఏప్రిల్ 23(నమస్తేతెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 78,244 ఎకరాల విస్తీర్ణంలో యాసంగి వరి పంట సాగు చేసినట్లు గుర్తించారు. 1,86,707 టన్నుల ధాన్యం దిగుబడులొస్తాయని, ఇందులో సన్నరకం ధాన్యం 1,35,406, దొడ్డురకం ధాన్యం 51,301 టన్నులు ఉంటుందని అంచనా వేశారు. ధాన్యం కొనుగోలుకు మొదట 186 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, తాజాగా 185 సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. 116 పీఏసీఎస్‌లకు, ఐకేపీకి 46, ఏఎంసీలకు 2, ఎఫ్‌పీవోలకు 21 ప్రభుత్వం కేటాయించింది. ప్రధానంగా యాసంగి ధాన్యం దిగుబడులు జిల్లాలో ముందుగా వచ్చే రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం తదితర మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గన్నీ సంచులు, ప్యాడీ క్లీన ర్లు, టార్పాలిన్లు, తేల కొలిచే, తూకం వేసే యంత్రాలను సమకూర్చారు. ఈ నేపథ్యంలో 24న రాయపర్తి మండల కేంద్రంలో పీఏసీఎస్‌కు కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించనున్నారు. కలెక్టర్ బీ గోపి, అదనపు కలెక్టర్ శ్రీవత్స, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇర్ఫాన్, జిల్లా సహకార అధికారి బి సంజీవరెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు ఈ కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాలో ఇదే తొలి కొనుగోలు కేంద్రం కానుంది.
యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి, కలెక్టర్ బీ గోపి కొద్దిరోజుల క్రితం వేర్వేరుగా జిల్లాలో ధా న్యం కొనుగోలు ప్రణాళిక, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలు చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు, రైస్‌మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ల అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించినందున టెండర్లు పొందిన ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు ఒకటి రెండు రోజుల్లో అగ్రిమెంట్ చేసుకుంటారని, కేంద్రా ల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేస్తారని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ చెప్పారు. కాగా, మొత్తం ధాన్యం కొనుగోలుకు 46,67,675 గోనెల సంచులు అవసరమని అధికారులు అంచనా వేశారు. వీటిలో 6,15,000 గోనె సంచులు ప్రస్తు తం అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరలో మిగతా గోనె సంచులను సేకరించే పనిలో ఉన్నట్లు తెలిపారు. 299 ప్యాడీ క్లీనర్లు, 3,600 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయన్నా రు. రాయపర్తిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో స్పెషల్ అధికారులు, కొనుగో లు కేంద్రాల ఇన్చార్జిలు, రైతులకు కూపన్లు అందజేసే అధికారులు క్షేత్రస్థాయిల్లో పర్యటిస్తున్నారు.