రాయపర్తి, ఆగస్టు 13 :సబ్బండ వర్గాల సమ్మిళితమే తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని బురహాన్‌పల్లిలో మంత్రి పర్యటించారు. గ్రామస్తులతో ముచ్చటించారు. మంచీచెడు తెలుసుకున్నారు. గ్రామ దేవతల ఆశీస్సులతో పల్లెలన్నీ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కుల వృత్తులకు సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని, పని చేసే పార్టీకే మళ్లీ పట్టం కట్టాలని కోరారు.
గ్రామ దేవతల ఆశీస్సులతో పల్లెలన్నీ సుభిక్షంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని బురహాన్‌పల్లి గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బోనాలు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన గ్రామంలోని గ్రామ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సబ్బండ వర్గాల సమ్మిళతమే సంపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నారు. అనేక కులాలు, మతాలు, జాతులు, వర్ణాలు, వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కలిసి మెలిసి జీవిస్తున్నారన్నారు. హిందూ-ముస్లిం-క్రైస్తవ మతాలన్నింటినీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం సమానంగా ఆదరిస్తోందన్నారు. గ్రామాలను కాపు కాసేది గ్రామ దేవతలేనని, ఏటా తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాల ప్రకారం గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం వల్లే తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలన్నీ సుభిక్షంగా ఉంటున్నట్లు తెలిపారు. కుల వృత్తులను ఆదరిస్తూ వాటి బలోపేతానికి కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదన్నారు. కాగా, గ్రామ శివారులోని నానుతండాలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి స్థానిక బీఆర్ఎస్ నాయకులు బీరాములు-లక్ష్మీ కుమారుడు వెంకట్-మహేశ్వరీల వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తాటివనంలో మంత్రి ఎర్రబెల్లి సందడి..
మండలంలోని బురహాన్‌పల్లి గ్రామం నుంచి మండల కేంద్రానికి కాన్వాయ్‌తో వస్తున్న మంత్రి గ్రామ శివారులోని తాటివనంలో కాసేపు ఆగి అక్కడి జనంతో కలిసి కాసేపు సందడి చేశారు. పలువురు గీత కార్మికులతో సరదాగా సంభాషించారు. ‘కల్లు దొరుకుతుందా గౌడ్ సాబ్…’ అంటూ ముందుకు కదిలారు. దీంతో అమాత్యుడు దయాకర్‌రావు అడగడంతో పలువురు గీత కార్మికులు మంత్రికి తాటికల్లు వంచగా ఆయన రుచి చూశారు. అనంతరం గీత కార్మికుల యోగ క్షేమాలను మంత్రి ఎర్రబెల్లి తెలుసుకుని కుల వృత్తిల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయన వెంట జడ్పీటీసీ రంగు కుమార్, బురహాన్‌పల్లి గ్రామ సర్పంచ్ సూదుల దేవేందర్‌రావు తదితరులున్నారు.