భీమదేవరపల్లి : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో
ఐదేళ్లపాటు తల్లి మెట్టు విజయ గ్రామ సర్పంచిగా సేవలందించగా..అదే బాటలో ఆమె తనయుడు మెట్టు సుగేందర్ రావు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెట్టు విజయ గ్రామ సర్పంచిగా పనిచేశారు. ఆమె భర్త మెట్టు నర్సింగారావు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. గ్రామంలో ప్రభుత్వ బడి ఒకటవ తరగతి నుంచి మూడో తరగతి వరకు మాత్రమే ఉండేది అందులోనూ అరకొరగా చిన్నారులు ఉండేవారు.
ఆంగ్ల మాధ్యమంపై మోజుతో వేరే గ్రామాలకు పిల్లలు చదువుకునేందుకు వెళ్లకుండా సర్కారు బడిలో ప్రైవేటు ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పిల్లల సంఖ్యను గణనీయంగా పెంచారు. అదే పాఠశాలను ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు పెంచడంలో ప్రధాన భూమిక పోషించారు. గ్రామానికి బస్సు సౌఖర్యం లేదు. దీంతో కొత్తకొండ నుంచి ధర్మారం గ్రామానికి రోడ్డు మరమ్మతులు పనులు చేయించారు. దీంతో పాటు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఆమె హయంలోనే అర్హులందరికీ పింఛన్లు లభించాయి.
అదే బాటలో తనయుడు..
తల్లి మెట్టు విజయ బాటలోనే ఆమె తనయుడు మెట్టు సుగేందర్ రావు గ్రామానికి సేవ చేసేందుకు ముందుకు వచ్చాడు. గతంలో బాలవికాస వాటర్ ప్లాంట్ గ్రామంలో నెలకొల్పేందుకు ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో శివాలయం నిర్మించారు. గ్రామ దేవత నిర్మాణం కోసం స్థలం కేటాయింపు, విగ్రహాలను స్వతహాగా అందజేశారు. సింగరేణిలో 35 సంవత్సరాలు యూనియన్ నాయకునిగా సేవలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
తనను గెలిపిస్తే గ్రామంలో వీధి దీపాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన, సీసీ రోడ్లు నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం తదితర వాటిని ఏర్పాటుచేసి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పుట్టిన ఊరిపై మమకారంతోనే ప్రజా సేవ చేయాలని ముందుకు వచ్చానని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన తనను ప్రజలు ఆదరించి, ఆశీర్వదించాలని అభ్యర్థించారు.