గూడూరు, ఏప్రిల్ 21: విద్యార్థులు విద్యార్థి దశ నుండే జాతీయ సమైక్యతను పెంపొందించుకొని సోదర భావంతో మెలగాలని ఎంఈఓ రవికుమార్ అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలలో నిర్వహించబడుతున్న ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో హర్యానా ఉత్సవాలను విద్యార్థులు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు హర్యానా రాష్ట్ర సాంప్రదాయ దుస్తులను ధరించి, హర్యానా రాష్ట్ర ఉత్సవాలను నిర్వహించి, హర్యాన రాష్ట్ర వంటకాలను కూడా తయారు చేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు దేశంలోని అన్ని ప్రాంతాల వారిని సమానంగా గౌరవించాలని, వారి సంస్కృతి సంప్రదాయాలను కూడా గౌరవించాలన్నారు. ఆహార వ్యవహారాల పట్ల గౌరవంతో ఉండాలని సూచించారు. విద్యార్థి దశ నుండే సోదర భావంతో జాతీయ సమైక్యతను కాపాడాలని అప్పుడే దేశం బలంగా తయారవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రమాదేవి, జ్యోతి రాణి, కళ్యాణి, రాణి, షాహిద్ ఆలీ, జగదీశ్వర్, చంద్రమౌళి, శ్రీనివాస్, రమేష్ , లక్ పతి వెంకటయ్య, పవన్, నవీన్ విద్యార్థులు పాల్గొన్నారు.