వరంగల్ చౌరస్తా: రష్యన్ విప్లవ సేనాని, సమ సమాజ నిర్మాత లెనిన్ ఆశయసాధనకు యువత పాటుపడాలని సీపీఐ కార్యదర్శి మేకల రవి అన్నారు. మంగళవారం శివనగర్‌లోని తమ్మెర భవన్లో లెనిన్ 150వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భగా రవి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మార్క్సిజాన్ని ఆధ్యయనం చేసిన లెనిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి కమ్యూనిస్టు దేశాన్ని ఏర్పాటు చేశాడని అన్నారు. ప్రజల్లో అంతరాలు లేకుండా సమసమాజాన్ని నిర్మించిన యోధుడు లెనిన్ అని కొనియాడారు.
సామ్రాజ్యవాదాన్ని బలంగా వ్యతిరేఖించడమే కాకుండా సామ్రజ్యవాద వ్యతిరేఖ సిద్ధాంతాన్ని రచించి ప్రపంచ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు బీజం వేశాడని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రపంచ వ్యాప్తంగా చాలా కమ్యూనిస్టు ఉద్యమాలు, పోరాటాలు పుట్టుకువచ్చాయని అన్నారు. ప్రజావ్యతిరేఖ విధానాలను అమలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై అలుపెరుగని పోరాటాలు చేయడానికి దేశవ్యాప్తంగావున్న యువత, కార్మికులు, కర్షకులు ఏకమై ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహయ కార్యదర్శి ఎస్.కే. భాషుమియా, పనాస ప్రసాద్, కార్యవర్గ సభ్యులు సంగి ఎలేందర్, జిల్లా సమితి సభ్యులు రమేష్, శరత్, రాజేంధర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.