వరంగల్, నవంబర్ 17 : నగరంలో ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్‌లపై రాష్ట్ర వైద్య మండలి అధికారులు దాడులు చేశారు. కేవలం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను నిర్వహించాల్సిన ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా క్లినిక్‌లను నిర్వహించడం, ఇటీవల అనేక ఫిర్యాదులు రావడంపై అధికారులు దృష్టిపెట్టారు. సోమవారం దీన్‌దయాళ్‌నగర్‌లో పీఎంపీ బండి సదానందం జనరల్ ప్రాక్టీషనర్‌గా ప్రిస్కిప్షన్ రాయడం, అందులో స్టెరాయిడ్, ఎక్కువ డోస్ కలిగిన యాంటీబయాటిక్ మందులు ఉండడం, బెడ్స్ వేసి ఆస్పత్రి నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆయన ప్రిస్కిప్షన్‌పై హై పవర్ డ్రగ్స్ విక్రయిస్తున్న వీణా మెడికల్, సాగరిక మెడికల్ స్టోర్స్‌పై డ్రగ్ కంట్రోల్ అథారిటీకి ఫిర్యాదు చేస్తామని అధికారులు తెలిపారు.
అక్కడే మరో నకిలీ డాక్టర్ మిట్టపల్లి సాంబమూర్తి క్లినిక్, కాజీపేటలో ల్యాబ్ టెక్నీషియన్ చదివిన ప్రభాకర్ క్లినిక్‌లలో తనిఖీ చేశారు. వారు స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్ మందులు రోగులకు అందించడంపై ఆధారాలు సేకరించిన అధికారులు కేసులు నమోదు చేశారు. అనంతరం టీజీఎంసీ అధికారి డాక్టర్ నరేశ్ మాట్లాడుతూ.. అర్హత లేకున్నా క్లినిక్‌లు నిర్వహిస్తున్నారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. క్వాలిఫైడ్ డాక్టర్లు సైతం వీరిని ఏజెంట్లుగా పెట్టుకుని రోగులను రప్పించుకుని కమిషన్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. అలాంటి దవాఖానలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐఎంఏ అధ్యక్షుడు అన్సార్ మియా మాట్లాడుతూ.. డాక్టర్‌గా అర్హతలేని పీఎంపీ, ఆర్ఎంపీలు రాసిన ప్రిస్కిప్షన్లపై మెడికల్ షాపులు మందులు విక్రయించొద్దన్నారు. తనిఖీల్లో హెచ్ఆర్డీఏ కార్యదర్శి డాక్టర్ రితీశ్ తదితరులు పాల్గొన్నారు.