తాడ్వాయి, జూలై 2 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతరకు మహూర్తం ఖరారైంది. ఈమేరకు బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మ ండలం మేడారంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క, సారలమ్మ. గోవిందరాజు, పగిడిద్దరాజుల పూజారులు తల్లుల గద్దెల ప్రాంగణంలో సమావేశమై మహాజాతర నిర్వహణ తేదీలను ప్రకటించారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం వచ్చే ఏడాది 2026 జనవరి 28న మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని 31వరకు నాలుగు రోజుల పాటు మేడారంలో తల్లుల మహోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవతను, ఏటూరునాగారం మండలంలోని కొండాయి, కొత్తగూడ మండలంలోని పూనుగొండ్ల నుంచి గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుతారని, 29న మేడారంలోని చిలుకలగుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దెపై కొలువుదీరుతుందని, 30న వనదేవతలకు భక్తుల మొక్కులు చెల్లించుకున్న అనంతరం 31న సాయంతరం 6గంటల సమయంలో తల్లులను వనప్రవేశం చేయించడంతో మహాజాతర ఘట్టం పూర్తవుతుందని పూజారులు తెలిపారు.