ఖిలావరంగల్, ఫిబ్రవరి 25 : సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాళుకు రూ.500 అని చెప్పి మూడు నెలలు అయిన ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ (ఏఐకేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ అన్నారు. మంగళవారం ధాన్యం బోనస్ డబ్బులు(Bonus money) చెల్లించాలని కోరుతూ డీఎస్వో కిష్టయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖిలా వరంగల్ మండలంలో ధాన్యం అమ్మిన ఏ ఒక్క రైతుకు తక్ పట్టి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లు యజమానులతో కుమ్మక్కై ప్రతి బస్తాకు ఆరు కిలోలకు పైగా తరుగు తీశారన్నారు.
క్వింటాళు సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అని చెప్పి మూడు నెలలు గడిచినా ఇవ్వలేదని విమర్శించారు. బొల్లికుంటలో గుండాల విజయ భాస్కరరావుకు 32 క్వింటాళ్లు, సోల్తీ రాజుకు 50 క్వింటాళ్లు, గవిచర్లకు చెందిన గుండు కొమ్మాలుకు 32 క్వింటాళ్ల బోనస్ డబ్బులు ఇవ్వలేదన్నారు. జిల్లాలో ఇంకా సుమారు 14 వేల మంది పైచిలుకు రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా ఇంకా అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం బోనస్ కూడా ఖాతాలో జమ చేయడం లేదని విమర్శించారు.
బోనస్ డబ్బులు అందిస్తే పంట పెట్టుబడికి ఆసరాగా ఉంటుందన్నారు. బోనస్ డబ్బుల కోసం అధికారుల చుట్టూ పదే పదే తిరుగుతున్నప్పటికీ సరియైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు. అధికారులు స్పందించి బోన్ డబ్బులు వేయకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుసుంబ బాబురావు, గోనె రామచందర్, ఆయుధం నగేష్, దేవర రాజు, చెవ్వా కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.