వరంగల్, మే 10 : నగరమంతా మూడో నేత్రం నిఘా ఉండనుంది. గ్రేటర్ కార్పొరేషన్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. 410 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 10 లక్షల జనాభా కలిగిన గ్రేటర్ కార్పొరేషన్లో ఐసీసీసీ ఏర్పాటు చేయనున్నారు. రూ.98.50 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ కంట్రోల్ కమాండ్ సెంటర్‌పై బుధవారం కుడా కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి, ఇన్చార్జి కమిషనర్ ప్రావీణ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, బల్దియా, కుడా ఇంజినీరింగ్, ఇరిగేషన్, స్మార్ట్‌సిటీ, పబ్లిక్ హెల్త్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్‌పై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ పనుల్లో వేగం పెంచి, జూన్ చివరి నాటికి ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రూ.98.5 కోట్లతో గ్రేటర్ కార్యాలయంలో ఈ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మ్యాట్రిక్స్ సొల్యూషన్ ప్రైవేట్ సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ దశల వారీగా సెప్టెంబర్ నాటికి అన్ని కంపోనెంట్లను చేర్చి పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రేటర్ కార్పొరేషన్ యాప్ వివరాలను ఐసీసీసీలో మ్యాపింగ్ చేసి ఈ-గవర్నెన్స్ సేవలు జూన్ చివరి నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బల్దియా ఈ-గవర్నెన్స్‌కు సంబంధించిన డాటా వివరాలను వెంటనే మ్యాట్రిక్స్ సంస్థకు అందజేయాలని ఆదేశించారు.
500 కెమెరాలు
ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్‌కు 500 కెమెరాలను అనుసంధానం చేయనున్నారు. బయటి రాష్ర్ర్టాల నుంచి నగరాలకు వచ్చే వాహనాల నంబర్లను సైతం గుర్తించే ఏఎన్పీఆర్ కెమెరాలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఆరు పెలికాన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని అగుడుపెట్టే ప్రతి వాహనాన్ని ఐసీసీసీ గుర్తించనుంది. నగర జంక్షన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఐసీసీసీతో అనుసంధానం చేయనున్నారు. ఇంటిగ్రేటెట్ కంట్రోల్, కమాండ్ సెంటర్లో ఈ-గవర్నెన్స్, ఏరియా ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్, సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్, సాలిడ్ వేస్ట్ మెనేజ్మెంట్, పెలికాన్ సిగ్నల్ సిస్టమ్, వేరియబుల్ మెస్సేజింగ్ సిస్టమ్, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, ఎన్విరాన్మెంటల్ సెన్సార్ సిస్టమ్, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్) లాంటి అంశాలను జోడించనున్నారు. నగరంలో 7 పాదచారుల సిగ్నల్, 10 జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ గురించి మ్యాట్రిక్స్ సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఐసీసీసీలో ఉండే కాంపోనెంట్స్‌పై ఒక్కోక్కటిగా నిపుణులు వివరించారు. గ్రేటర్ వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న ఐసీసీసీలో ఉండే ప్రత్యేకతలను తెలిపారు. ఈ మ్యాట్రిక్స్ సంస్థ గతంలో వారణాసి నగరంలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసి విజయం సాధించింది. సమావేశాల్లో బల్దియా ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, స్మార్ట్‌సిటీ పీఎంఈ ఆనంద్ వోలేటి, సీహెచ్‌వో శ్రీనివాసరావు, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, కుడా ఈఈ భీమ్రావు, ఇరిగేషన్ ఈఈ ఆంజనేయులు, రాజయ్య, సంజయ్‌కుమార్, ట్రాఫిక్, లా అండ్ అర్డర్, ఇరిగేషన్, పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు పాల్గొన్నారు.