భీమదేవరపల్లి, జూన్ 23 : బీఆర్ అంబేద్కర్ సాక్షిగా దళిత ప్రజాప్రతినిధికి పరాభవం ఎదురైంది. నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతున్న హనుమకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్ చేతిలో నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ మైకును లాక్కొని అవమానపరిచారు. దీంతో అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు జడ్పీచైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో జడ్పీచైర్మన్ సుధీర్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్ఎస్యూఐ నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడు కావడం అభినందనీయమన్నారు. ఇదే క్రమంలో బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి అయితే తానే మొదటగా సంతోషిస్తానన్నారు. గత ప్రభుత్వం 239 ఉన్న ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లను 1000కి పెంచినట్లు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పేరిట అప్పటి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్తం పేరుమీద దళిత, గిరిజనుల ఒక్కో కుటుంబానికి రూ.12లక్షలు ఇవ్వాలని కోరారు. ఈ తరుణంలో పక్కనే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కలుగజేసుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో రాజకీయాలు మాట్లాడొద్దంటూ జడ్పీచైర్మన్ చేతిలోనుంచి మైకును లాక్కున్నారు. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు జడ్పీచైర్మన్ పలుమార్లు మైక్ అడిగినా ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. వేదిక సమీపంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ‘జై కాంగ్రెస్..డౌన్ డౌన్ బీఆర్ఎస్’ అంటూ నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది.
గాంధీనగర్ విగ్రహావిష్కరణ సభలో ఎక్కడా రాజకీయాలు ప్రస్తావించలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ అంచెలంచెలుగా ఎదిగారని, బీసీ కోటాలో ముఖ్యమంత్రి అయితే తానే మొదటగా సంతోషిస్తానని చెప్పాను. ఎస్సీ విద్యార్థుల సంక్షేమం కోసం రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను మరింతగా పెంచాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పటి ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్తం పేరిట దళిత, గిరిజనులకు ఒక్కో కుటుంబానికి రూ.12లక్షలు ఇస్తామని ప్రకటించిందని గుర్తు చేశాను. జడ్పీచైర్మన్ హోదాలో రాజకీయాలకతీతంగా మాట్లాడుతుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ తన వద్దకు వచ్చి చేతిలోంచి మైక్ లాక్కొని అవమాన పరిచారు.