ఖిలావరంగల్: దాడి కేసులో బెయిల్పై బయటకు వచ్చిన కొంతమంది వ్యక్తులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో హంగామా చేశారు. ఫిర్యాదు చేసిన బాధితుడు ఇంటి సమీపంలో బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అంతు చూస్తామంటూ హెచ్చరించారు. దీంతో భయభ్రాంతులకు గురైన బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఫిరోజ్ అలీ తెలిపిన కథనం ప్రకారం.. ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్లో లారీ సీరియల్ విషయం గురించి అడిగినందుకు ఏప్రిల్ 24న తనతో పాటు మరో వ్యక్తి షేక్ అజ్మర్పై లారీ ఓనర్లు శ్రీకాంత్, శంకర్, రంజిత్, రాకేష్, దిలీప్, అజీమ్, సాయి, శ్రవణ్ దాడి దాడి చేశారు.
దీంతో తన ఎడమ కాలు విరుగగా చికిత్సకు రూ.1.50 లక్షలు ఖర్చు కాగా వైద్యులు మూడు నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. అలాగే మరో బాధితుడు షేక్ అజ్మద్కు కూడా బలమైన గాయాలు తగిలాయి. ఇదే విషయంపై ఫిర్యాదు చేయగా గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. పోలీసులు సోమవారం దాడికి పాల్పడిన వారిని కోర్టులో హాజరు పరచగా బెయిల్ పై బయటికి వచ్చి సోమవారం రాత్రి చింతల్లోని తన ఇంటి సమీపంలో పటాకులు కాలుస్తూ హంగామ చేశారని, నీ అంతు చూస్తానని, కోర్టులు గాని పోలీసులు గాని ఏమి చేయలేరంటూ భయభ్రాంతులకు గురి చేశారని, దీంతో మిల్స్ కాలనీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నాడు.