ఐనవోలు, జనవరి 12 : భక్తులు కోర్కెలు తీర్చే కొంగు బంగారం, కోరమీసాల ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణతో ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు దాదాపు మూడు నెలల పాటు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం స్వామి వారికి నూతన వస్ర్తాలంకరణ, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనము, ధ్వజారోహణము, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాదలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
14న బోగి పండుగ, 15న మరక సంక్రాంతి బండ్లు తిరుగుట, 16న కనుమ, 17న మహాసంప్రోక్షణ సమారాధన, 23న భ్రమరాంభిక వసంతపంచమి, భ్రమరాంభిక అమ్మవారి త్రయోదశ వార్షికోత్సవం, ఫిబ్రవరి 1న ఎల్లమ్మ దేవత పండుగ కార్యక్రమాలు జరుగనున్నాయి. కాగా, ఈ ఉత్సవాలకు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటుగా ఇతర రాష్ర్టాల నుంచి కూడా ప్రజలు తరలివస్తారు. ప్రధానంగా భక్తులు దేవాలయ ఆవరణలో విడిది చేసి భోగి, సంక్రాంతి రోజుల్లో బోనాలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. బోనాల్లో నైవేద్యాన్ని ఎల్లమ్మ దేవతకు, స్వామి వారికి నివేదించడంతో పాటుగా పట్నాలు వేయడం అత్యంత ప్రధానమైన ఘట్టాలు. మల్లికార్జునస్వామిని తమ ఇలవేల్పుగా గొల్లకురుమలు పసుపు బండారితో పూజిస్తారు.
ఇందుకోసం దేవాలయ అధికారులు ఇప్పటికే ప్రాంగాణాన్ని పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు స్వామి వారి దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. దేవాలయం లోపల చలువ పందిళ్లు వేయడంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలకు బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. అలాగే శివసత్తుల పూనకాలు, వరంపట్టే మహిళలు, బగ్గు పూజారుల కోసం ప్రత్యేకంగా వసతులను కల్పించారు. దాతల సహకారంతో మల్లన్న సదన్‌లో నిర్మించిన మరో 14 గదులు అతిత్వరలో అందుబాటులోకి రానున్నాయి. కుడా ఆధ్వర్యంలో మరో రెండు ఐమాస్ట్ లైట్లు ఏర్పాటయ్యాయి.
మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ, దేవాలయ నిధులు, దాతల సహకారంతో అన్ని వసతులు కల్పిస్తున్నాం. అందరి సహాయ సహకారలతో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం.
– కందుల సుధాకర్, ఈవో