Mahadevpur | మహాదేవపూర్ (కాళేశ్వరం) జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలను పెంచాలని మండల విద్యాధికారి ప్రకాష్ బాబు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో బడిబాట కార్యక్రమం పై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బడి ఈడు పిల్లలను గుర్తించి రెండున్నర సంవత్సరాల నుండి ఐదేళ్ల లోపు పిల్లలను వారి ఇంటి సమీపం లోని అంగన్వాడి కేంద్రంలో, ఐదు నుండి తొమ్మిది సంవత్సరాల పిల్లల్ని వారి ఇంటి దగ్గరలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 10 నుండి 15 సంవత్సరాల పిల్లల్ని వారి ఇంటికి దగ్గరలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, గ్రామ విద్యా విద్యాభిమానుల సహకారంతో పాఠశాల ఉపాధ్యాయులు చేర్పించాలని ఆయన అన్నారు.
అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వే నిర్వహించి బడిబయట పిల్లల్ని గుర్తించి గ్రామంలోని అన్ని అంగన్వాడి సెంటర్లలో, ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, అలాగే 15 సంవత్సరాల పై చిలుకు ఉన్న డ్రాప్ అవుట్ పిల్లల్ని మండల కేంద్రంలోని ఓపెన్ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్చి చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కృష్ణ, కాంప్లెక్స్ హెచ్ఎం బండం రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు మహేష్, కల్పన, ఉపాధ్యాయులు శంకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.