మహబూబాబాద్: ఉద్దేశపూరితంగా పోలీసులు అక్రమ కేసులను నమోదు చేయడం కరెక్ట్ కాదని సామాజికవేత డాక్టర్ వివేక్ అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం సెప్టెంబర్లో వరదలు వచ్చినప్పటి నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాన్నారు. వాటిని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు కావాలనే తనపై అక్రమ కేసులను నమోదు చేయిస్తున్నారని తెలిపారు.
ఈ నెల 12న జిల్లా కేంద్రంలో తమకు సంబంధించినవారు కార్యక్రమాలు చేశారని ముగ్గురిపై పోలీసులు కేసుల నమోదు చేశారు. గతంలో కూడా అనేక మంది పలు కార్యక్రమాలు చేసిన వారిపై మాత్రం కేసులను నమోదు చేయలేదన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానులేనని తప్పు చేసిన ప్రతి వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఉద్దేశపూర్వకంగా నమోదుచేసే కేసులను మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుగులోతు భీమా నాయక్, శివ, సూర్య ప్రకాష్, సాయి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.