మహబూబాబాద్ : జిల్లాలో ప్రోటోకాల్ (Protocol ) పాటించక తనను అవమాన పరిచిన మంత్రి, ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ (Satyavathy Rathode ) డిమాండ్ చేశారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు తనను ఆహ్వానించకపోవడంపై శాసనమండలిలో ప్రశ్నిస్తానని తెలిపారు.
జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభానికి వచ్చిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించి ఎమ్మెల్సీగా తనను ఎందుకు ఆహ్వానించలేదని పేర్కొన్నారు. మహబూబాబాద్ ప్రాంతానికి దశాబ్దాల కాలంగా గిరిజన ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్న తనను అగౌరవ పరిచారని ఆరోపించారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి, శాసన మండలి దృష్టికి రాతపూర్వకంగా తీసుకెళ్తానని అన్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే నైతిక హక్కు మీకు లేదని అన్నారు. ప్రజాప్రతినిధిగా తనకే అవమానం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తప్పు జరిగిందని భావిస్తే మంత్రి, ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పేవరకు ఎవరిని వదిలేది లేదని అన్నారు.