వైద్య విద్య సీట్ల ప్రవేశాల్లో స్థానికత లొల్లి నెలకొంది. గతంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివినవారిని లోకల్‌గా పరిగణించేవారు. అయితే ఇతర రాష్ర్టాల వారు ఇక్కడ చదవకపోయినా 6, 7, 8, 9 తరగతులు చదివినట్లు తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి సీట్లు ఎగరేసుకుపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం జీవో 33ను తీసుకొచ్చిందని, దీన్ని అమలు చేయకపోవడంతో తమ పిల్లలు నష్టపోతున్నారని శుక్రవారం హనుమకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనం (ఏకశిల పార్కు)లో నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వెంటనే జీవో 33ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
– హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 10
2024-25 అడ్మిషన్స్ సమయంలో కొంతమంది కోర్టుకు వెళ్లగా, చివరిదశలో ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమవుతుందన్న కారణంతో కోర్టుకు వచ్చిన అందరినీ కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని, మిగిలిన వారికి జీవో 33ను వర్తింపజేస్తామని చెప్పారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. 33 జీవో ప్రకారం స్థానికేతరులుగా పరిగణించబడే 135 మంది కోర్టుకు వెళ్లి అడ్మిషన్స్ ప్రక్రియలో పాల్గొన్నారని, వీరిలో 86 మంది ఏ కేటగిరిలో ఎంబీబీఎస్ సీట్లు పొందారని పేర్కొన్నారు. మరికొంతమందికి బీడీఎస్‌లో సీట్లు వచ్చాయని వివరించారు. మొత్తంగా 120కి పైగా తెలంగాణేతరులు మెడికల్ సీట్లు పొందారని చెప్పారు. దీంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగిందని, 2025-26 మెడికల్ అడ్మిషన్లలో 33 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సీట్లు రాక ఆత్మహత్య చేసుకున్నారు
గతేడాది సీట్లు రాక తెలంగాణకు చెందిన నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అంశంపై మళ్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ జరుగుతుండడంతో ఇక్కడి వారికి అన్యాయం జరగకుండా చూడాలి. స్థానికేతరులకు ఈసారి సీట్లు ఇస్తే పిల్లలతో దీక్షకు దిగుతాం. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్రల్లో స్థానికులకే సీట్లు ఇస్తారు, కానీ, తెలంగాణ లో మాత్రం ఇక్కడ చదువుకోకపోయినా దొడ్డిదారిన వచ్చిన వారికి సీట్లు ఇస్తున్నారు. 1-10 వరకు తెలంగాణలో చదివిన వారికి సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే సీట్లు కేటాయించాలి.
– రావుల మధు, విజయపాల్కాలనీ, హనుమకొండ
ఇతర రాష్ర్టాల వారికి ఎలా ఇస్తారు?
కోర్టుకు వచ్చిన వారు లోక లా.. కాదా అని గుర్తించకుండా ప్రభు త్వం 135 మందిలో 86 మందిని లోకల్‌గా పరిగణించింది. ఇందులో 56 మంది తెలంగాణకు సంబంధంలేనివారు ఉన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఇలా జరిగింది. తెలంగాణ విద్యార్థులు ఒక్క సీటు కూడా వదులుకోవద్దు. విదేశాల్లో, ఇతర రాష్ర్టాల్లో చదివిన వారికి సీట్లు ఎలా ఇస్తారు? ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33ను వెంటనే అమలు చేయాలి. 86 మంది ఏ కేటగిరిలో ఎంబీబీఎస్ సీట్లు పొందారు. కొంతమంది బీ కేటగిరిలో, ఇంకొందరు బీడీఎస్‌లో జాయిన్ అయ్యారు.
– మల్లోజు సత్యనారాయణాచారి, నీట్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు