పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 29 : ఎట్టకేలకు లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వరంగల్, హనుమకొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం విస్తృతంగా దాడులు నిర్వహించి, పలు కేసులు నమోదు చేశారు. ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 27న ‘ఆ శాఖలో అందరూ ఇన్చార్జీలే… మూడు నెలల నుంచి కరువైన అధికారుల పర్యవేక్షణ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వరంగల్లోని అండర్ బ్రిడ్జి, గవిచర్ల క్రాస్ రోడ్డు, శంభునిపేట ప్రాంతాల్లో చేపలు, చికెన్, మటన్ అమ్మకాలను పరిశీలించారు. చాలా మంది ముద్రించని బాట్లతో తూకం వేయడం, తక్కువ తూకంతో అమ్మడం, రెన్యువల్ చేయించుకోని తరాజులు వాడడాన్ని గుర్తించారు. అలాగే రోడ్డుపై కూరగాయాలు, ఇతర వస్తువుల అమ్మకాలను పరిశీలించారు.
దాదాపు 25 చోట్ల దాడులు నిర్వహించి, 9 కేసులు నమోదు చేయడంతో పాటు రూ.8,500ల కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు.. అలాగే హనుమకొండలోని శాయంపేట, డబ్బాలు తదితర 20 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి 7 కేసులు నమోదు చేయడంతో పాటు రూ. 9,500ల కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. వరంగల్ లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ సిద్ధార్థకుమార్ ఆదేశాల వరకు దాడులు నిర్వహించినట్లు లీగల్ మెట్రాలజీ అధికారులు శ్రీలత, అజీజ్ తెలిపారు. వ్యాపారులు వినియోగదారులను మోసం చేయొద్దని, తాము ఆకస్మికంగా తనిఖీలు చేపడుతామని వారు హెచ్చరించారు.