ఖిలావరంగల్: వరంగల్ మండలం ఎల్బీనగర్లో అనుమతి లేని షాహిన్ హై స్కూల్‌కి పరోక్షంగా సహకరిస్తున్న వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్‌ని విధుల నుండి తొలగించాలని వాపక్ష విద్యార్థి సంఘాలుఏఐఎఫ్, డీఎస్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో ధర్నా చేశారు. అనంతరం వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. అనుమతి లేకుండా నడుస్తున్న షహీన్ హై స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా పోరాటాలు చేస్తుంటే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అనుమతి లేని షాహిన్ హై స్కూల్ బోర్డులను తొలగిస్తామని హామీ ఇచ్చిన డీఈవో పరోక్షంగా షాహిన్ హైస్కూల్ యాజమాన్యానికి సహకరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు హకీమ్ నవీద్, గడ్డం నాగార్జున, ఎల్. శరత్, చుక్క ప్రశాంత్ వినతిపత్రంలో ఆరోపించారు. జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే స్కూల్ యాజమాన్యం అనుమతి లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నారని, విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా గతంలో అనేక ఆరోపణలు ఉన్న డీఈవో తొలిగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు.