జనగామ, మే 7 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లాకు మహర్ధశ పట్టనుంది..ఇప్పటికే సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న సమీకృత కలెక్టరేట్ భవనం పట్టణానికి తలమానికంగా మరగా, జిల్లా కేంద్రం ఆకృతి తీసుకొచ్చేలా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్‌తో జనగామ నియోజకవర్గ అభివృద్ధి సహా ప్రధానంగా జిల్లా కేంద్రం రూపురేఖలు మార్చేలా చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. దీనిపై పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని కేసీఆర్‌కు అందజేశారు. జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్న జనగామ పురపాలక సంఘం పరిధిలో జరగాల్సిన పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలను వినతిపత్రంలో పొందుపరిచారు. జిల్లా కేంద్రమైన జనగామ నలు దిక్కులా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని, వాటిలో ‘కుడా’ ఓపెన్ ప్లాట్స్ రెసిడెన్షియల్ లేఅవుట్స్ ప్రారంభించి అత్యాధునిక వసతులతో కూడిన కాలనీలు అభివృద్ధి చేయాలని కోరిన ముత్తిరెడ్డి అందుకు అవసరమైన ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదనలు సైతం కేసీఆర్‌కు అందజేశారు.
పట్టణంలోని సిద్దిపేట రోడ్డులోని హౌసింగ్‌బోర్డు స్థలంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన దృష్ట్యా మొదటి విడుతలో శామీర్‌పేట నుంచి పసరుమడ్ల వరకు ఉన్న ప్రభుత్వ భూముల్లో ఓపెన్ ప్లాట్స్ లేవుట్స్ ప్రారంభించాలని కోరారు. జిల్లాకు కొత్తగా మంజూరైన నవోదయ రెసిడెన్షియల్ పాఠశాల (నవోదయ స్కూల్)ను తరిగొప్పుల మండలంలో ఏర్పాటు చేయాలని కోరారు. వీటితోపాటు జిల్లా కేంద్రానికి పశ్చిమ దిక్కున పెంబర్తి నుంచి శామీర్‌పేట మీదుగా యశ్వంతాపూర్ అవుటర్ బైపాస్ రోడ్డు వరకు మరో బైపాస్ రోడ్డు నిర్మాణం సహా జనగామ జిల్లా కేంద్రం రెండు బైపాస్‌ల లోపల పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయాలని కోరారు. వీటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో మాట్లాడి వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారిలో టీఆర్ఎస్ జన గామ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గుజ్జ సంపత్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.