ప్రజల కోసం పనిచేయాల్సిన కొందరు ఖాకీలు ఖద్దర్ గుప్పిట్లో నలిగిపోతున్నారు. అధికార పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులు చెప్పింది వింటేనే పూర్తిస్థాయి గడువు వరకు పనిచేస్తున్నారు. లేదంటే వారి పోస్ట్ పోగొట్టుకుంటున్నారు. తమ పనులు చేయని పోలీసులు మాకొద్దంటూ నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. తాము అనుకున్నది సాధిస్తున్నారు. దీంతో నిజాయితీగా పనిచేయాలనుకున్న కొందరు ఇన్స్పెక్టర్లు రాజకీయ జోక్యంతో బదిలీ అవుతున్నారు. ఉన్నతాధికారుల సపోర్ట్ ఎంతున్నా.. నేతల సపోర్ట్ లేనంతకాలం లూప్లైన్లోనే పని చేస్తున్నారు.
– సుబేదారి, మార్చి 22
అధికార పార్టీ నేతలు చెప్పిందే చేయాలి..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు పోలీసు శాఖను శాసిస్తున్నారు. లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లను గుప్పిట్లో పెట్టుకొని ల్యాండ్, ఆర్థిక లావాదేవీల సెటిల్మెంట్లు చేస్తూ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోకుండానే తమ నియోజకవర్గాల్లో ఇన్స్పెక్టర్లకు లేఖలతో పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారు. మరికొందరైతే ఒక్కో స్టేషన్‌కు వచ్చే ఆదాయాన్ని బట్టి రూ. 15 నుంచి రూ. 20 లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారు.
ముఖ్యంగా లిక్కర్ షాప్‌లు, స్టోన్ క్రషర్లు, గ్రానైట్ క్వారీలు, రైస్‌మిల్లులు, ఇసుక ప్రాంతాలు, భూమి ధరలు, వ్యాపార వాణిజ్య సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లెక్కలు వేసుకొని మరీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకొందరు డబ్బులు తీసుకోవడం లేదంటూనే నియోజకవర్గాల్లో పోలీసులను అడ్డుపెట్టుకొని, అక్రమంగా పనులు చేయించుకుంటున్నారు. ప్రత్యర్థులను తప్పడు కేసుల్లో ఇరికించడానికి పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు.
మాట వినకుంటే పోస్ట్ ఊస్ట్..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసుతో పోస్టింగ్‌లు పొందిన పలువురు ఇన్స్పెక్టర్లు ఇక్కడ డ్యూటీ చేయడం కంటే బదిలీ కావడమే బెటర్ అనుకుంటున్నారు. ముఖ్యంగా నేతలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పిన చట్టవిరుద్ధమైన పనులు పక్కన పెట్టడం, ఎమ్మెల్యే చెప్పినా ‘ఆ పనిచేస్తే పై అధికారులకు ఎక్కడ దొరికిపోతామేమో? శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో? అనే భయంతో లూప్‌లైన్ విధులు నిర్వర్తించడానికి సిద్ధపడుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి, ఆరు నెలలు, ఏడాదిలోపే వారిని బదిలీ చేసి, తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారు.
ఇలాంటి కారణాల నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నర్సంపేట సబ్ డివిజన్లో ఏడాదిలోపే ఇద్దరు ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వరంగల్ సబ్ డివిజన్లో అధికార పార్టీ నేత, అనుచరుడి అక్రమ దందాలు, సెటిల్మెంట్లకు వంతపాడిన ఓ ఏసీపీ, నలుగురు ఇన్స్పెక్టర్లు సస్పెండ్ అయి పరువు తీసుకున్నారు. జనగామ టౌన్లో కూడా ఓ ఇన్స్పెక్టర్ ఏడాదిలోపే బదిలీ అయ్యాడు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజవర్గంలో పోస్టింగ్ పొందిన ఓ ఇన్స్పెక్టర్ను ఏడాది కాకముందే ఓ ఘటనను సాకుగా చూపించి బదిలీ చేసినట్లు ప్రచారం ఉన్నది.
అయితే సదరు ఇన్స్పెక్టర్ ప్రభుత్వ భూమి వివాదంలో అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేయలేదనే కారణంతోనే బదిలీ చేసినట్లు తెలిసింది. కాగా, వరంగల్ సబ్ డివిజన్లో గతంలో ఇన్స్పెక్టర్లు సస్పెండ్ కావడంతో, ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు అధికార పార్టీ నేత, అతని అనుచరుడి సెటిల్మెంట్లకు సహకరించకపోవడంతో వారిని ఇక్కడ డ్యూటీ చేయొద్దంటూ బూతులు తిడుతున్నట్లు తెలుస్తున్నది. అలాగే వారిని బదిలీ చేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి, అనుకూలమైన వారికి లేఖలు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో వారు తమకు ఎప్పుడు బదిలీ అవుతుందని, సదరు నాయకుడి టార్చర్ నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందని ఎదురు చూస్తున్నారు.
నేతల ఆశీస్సులుంటే..
అధికార పార్టీ నేతల ఆశీస్సులున్న పోలీసులు ఏళ్లుగా పోస్టింగ్‌లో ఉంటున్నారు. వారు చెప్పిన పనులు చేస్తూ, నాలుగు కాసులు వెనకేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారిపై అవినీతి ఆరోపణలు వచ్చినా, బాధితుల నుంచి ఫిర్యాదులు అందినా నేతలు కాపాడుతున్నారు. కాజీపేట సబ్విజన్లో ఒకరు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మరొకరు నేతల అండతో గడువు ముగిసినా అక్కడే పనిచేస్తున్నారు. పరకాల సబ్ డివిజన్లో ఓ ఇన్స్పెక్టర్ స్టేషన్‌కు వచ్చే బాధితులు, నిందితులు, చివరికి సిబ్బందిని సైతం తిడుతూ బూతు అధికారిగా పేరు తెచ్చుకున్నాడు.
అతడు రాష్ట్ర సర్కార్‌లోని కీలక నేత బంధువు సపోర్ట్‌తో పోస్టింగ్ తెచ్చుకోవడంతో అక్కడి అధికార పార్టీ నేత చూసీ చూడనట్లు ఉంటున్నారని తెలిసింది. అలాగే నర్సంపేట సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఏఎస్సైపై బాహాటంగా అవినీతి ఆరోపణలు వచ్చినా అతడికి అధికార పార్టీ నేత సపోర్టుందని తెలిసి అధికారులు చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇటీవల పోస్టింగ్ పొందిన ఓ ఇన్స్పెక్టర్ ఇంటి వద్దనే సెటిల్మెంట్లకు తెరలేపినట్లు తెలిసింది. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఓ ఇన్స్పెక్టర్పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా అతడిపై ఎలాంటి చర్యలు లేవు. ఇక హనుమకొండ సబ్ డివిజన్లోని ఇద్దరు ఇన్స్పెక్టర్లు అధికార పార్టీ నేత దగ్గరి బంధువు గుప్పిట్లో పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.