హనుమకొండ చౌరస్తా, మే 2 : ఉన్న విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యార్థులు, అధ్యాపకులు అయోమయానికి గురవుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి బీసీ వెల్ఫేర్ డిగ్రీ గురుకుల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించాలని బీఆర్ఎస్వీ సీనియర్ నాయకుడు డాక్టర్ పాలమాకుల కొమురయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కేయూలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్టంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాలల సొసైటీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాల సొసైటీలు అందులో చదువుతున్న విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటించారు.
కానీ, అందరిది ఒకదారైతే బీసీ వెల్ఫేర్ డిగ్రీ గురుకుల సొసైటీలో ఉన్న పై అధికారులది ఒకదారిలా ఉందన్నారు. మండుతున్న ఎండలతో విద్యార్థులు తాగడానికి చల్లని నీళ్లులేక కళాశాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా ఇప్పటివరకు వేసవి సెలవులు ప్రకటించకపోవడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందన్నారు. రాష్ర్టంలోని చాలా కళాశాలలో విద్యార్థులకు అధ్యాపకులకు కనీసం ఫ్యాన్లు, ఇతర మౌలిక వసతులు లేకపోవడం వలన విద్యార్థులు అనేకమార్లు అనారోగ్యానికి గురవుతు న్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కత్తెరపల్లి దామోదర్, కేయూ ఇంచార్జి జెట్టి రాజేందర్, జిల్లా కో-ఆర్డినేటర్ ఆరురి రంజిత్, యూనివర్సిటీ నాయకులు కొనుకటి ప్రశాంత్, రమేష్, సురేష్ పాల్గొన్నారు.