గిర్మాజీపేట, ఏప్రిల్ 4: జిల్లావ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు మమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం వరకు 3,36,192 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. అందులో 47,027 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని చెప్పారు. అలాగే, 30,930 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ చేయగా, అందులో 15,652 మందికి అందజేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 180 జీపీలు, 50 వార్డుల్లో కంటివెలుగు పరీక్షలు పూర్తయ్యాయని, 26 గ్రామ పంచాయతీలు, 18 వార్డుల్లో త్వరలోనే పూర్తవుతాయని వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 3,36,192 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా.. అందులో 1,58,720 మంది పురుషులు, 1,77,116 మంది మహిళలు, 336 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు చెప్పారు. 50,508 ఎస్సీలు, 38,842 ఎస్టీలు, 2,23,268 బీసీలు, 14,530 ఓసీలు, 9,024 మైనార్టీలు, 40 ఏండ్లలోపు 6,106 మంది, 40 ఏండ్ల పైబడిన 40,911 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్‌వో వివరించారు. ఇందులో 2,58,234 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని గుర్తించామన్నారు.
కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం
మండలంలోని నందనాయక్తండాలో మంగళవారం కంటి వెలుగు శిబిరాన్ని జడ్పీటీసీ పోలీసు ధర్మారావు ప్రారంభించారు. తండావాసులు నేత్ర పరీక్షలు చేసుకోవాని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బదావత్ అమ్మి, ఉపసర్పంచ్ ధరంసోత్ వీరన్న, ఎంపీడీవో వీరేశం, ఎంపీవో ప్రభాకర్, వైద్యాధికారి మాధవీలత పాల్గొన్నారు. అనంతరం నందనాయక్‌తండా, దస్రుతండాలో నేత్ర వైద్య డీఎంహెచ్‌వో వెంకటరమణ పరిశీలించారు. కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అంగన్వాడీ టీచర్లు కంటి వెలుగు ప్రోగ్రాంలో భాగస్వాములు కావాలని కోరారు. నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించే గ్రామంలో ముందుగానే టాంటాం వేయించాలని సర్పంచ్‌లకు సూచించారు. అలాగే, గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ గిరిప్రసాద్‌నగర్‌లోని బస్తీ దవాఖానలో కంటి వెలుగు శిబిరాన్ని కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, గిరిప్రసాద్‌నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని లక్నేపల్లి, జీజీఆర్పల్లిలో కంటి వెలుగు శిబిరాలను సర్పంచ్‌లు గొడిశాల రాంబాబు, తుత్తూరు కోమల పరిశీలించారు. అంధత్వ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారు కోరారు. కార్యదర్శులు అనితారెడ్డి, సుమలత, వైద్యాధికారులు భరత్‌కుమార్, సాజియా, శివ పాల్గొన్నారు. అంతేకాకుండా 24వ డివిజన్ ఎల్లంబజార్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరాన్ని టీఆర్ఎస్ నాయకుడు ఆకుతోట శిరీష్ ప్రారంభించారు. డివిజన్ ప్రజలు కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ఈకే మంజుల, మేఘనసాయి, డీఈవో స్వాతి, సూపర్వైజర్ మసూద్ అలీ, సీకేఎం సిబ్బంది, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పందికొండ శివరాజ్, నాయకులు దాచెపల్లి సీతారం, ఎండీ రబ్బాని, చాగంటి కిరణ్, మదన్, వెంకన్న, ఇర్ఫాన్, నవీన్ పాల్గొన్నారు.