కాళేశ్వరం/సుబేదారి, జూన్ 19 : ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు అధికారి ఆ డిపార్ట్మెంట్ పరువు తీశాడు. తన స్టేషన్లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై కన్నేశాడు. పథకం ప్రకారం ఇంటికి పిలిపించుకొని తన సర్వీస్ రివాల్వర్‌తో చంపుతానని భయపెట్టి తన కామవాంఛ తీర్చుకున్నాడు. అతడి బాగోతం బయటపడడంతో చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అతడిని సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే కొందరి అనైతిక వ్యవహారాలతో పోలీసు శాఖ అపకీర్తి మూటగట్టుకుంటుండగా తాజాగా కాళేశ్వరం ఘటనతో మరోసారి చర్చనీయాంశమైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఘటన వివరాలిలా ఉన్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న భవానీ సేన్ మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై కన్నేశాడు. ఒకరోజు ఆమెకు ఫోన్ చేసి తాను ఇంట్లో జారి పడ్డానని, లేవలేకపోతున్నానని చెప్పడంతో ఆందోళనతో అక్కడికి వెళ్లగా తన సర్వీస్ రివాల్వర్ చూపించి బలాత్కరించాడు. అక్కడితో ఆగకుండా మరో రోజు రాత్రి కానిస్టేబుల్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వెళ్లి భయపెట్టి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపుతానంటూ బెదిరించాడు. ఐతే సదరు కానిస్టేబుల్ రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీని కలిసి జరిగినదంతా చెప్పడంతో మంగళవారం రాత్రి కాటారం డీఎస్పీ, సీఐలు కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విచారణ జరపడంతో వాస్తవమే అని తేలింది. ఇదే కాకుండా మరికొన్ని బయటకు వచ్చాయి. స్థానికంగా ఉండే చికెన్ సెంటర్ల నుంచి రోజూ బలవంతంగా చికెన్ తీసుకువెళ్లేవాడని, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసేవాడని తెలవడంతో భూపాలపల్లికి తీసుకొచ్చి విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో ఎస్సైని విధుల నుంచి తొలగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భవానీసేన్‌ను బుధవారం భూపాలపల్లి జూనియర్ సివిల్ కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి అఖిల 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు పరకాల సబ్ జైలుకు తరలించారు.
ఇటీవల వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొందరు అధికారుల రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఏడాదిన్నర క్రితం గీసుగొండ ఇన్స్పెక్టర్గా పనిచేసిన రాయల వెంకటేశ్వర్లు, దామెర ఎస్సైగా పనిచేసిన హరిప్రియ అనైతిక వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇద్దరు ఒకే రోజు సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఓ మహిళా ఇన్స్పెక్టర్ ఇంటికి తోటి ఇన్స్పెక్టర్ రాగా, ఆమె భర్తకు అతడికి గొడవ జరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకు వెళ్లింది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేసిన రిజర్వ్ ఇన్స్పెక్టర్, వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మహిళా ఎస్సైపై లైంగిక వేధింపులకు పాల్పడగా అతడిపై కేసు నమోదైంది. కేయూసీలో పనిచేసిన ఎస్సైలు సంపత్, అనిల్ లైంగిక వ్యవహారాలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. కొద్ది రోజుల క్రితం ఎస్ఐబీలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ తిరుమతి చింతగట్టు క్యాంపు ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌కు ఓ మహిళతో వచ్చాడనే ఆరోపణలు రాగా, కేయూసీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. మహిళ ఉన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు విచారణ రిపోర్ట్‌ను ఉన్నతాధికారులకు నివేదించారు. కాగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని చాలా మంది పోలీసు అధికారుల అనైతిక వ్యవహారాలు వెలుగులోకి రాకుండా ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటివి జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
జయశంకర్ భూపాలపల్లి. జూన్ 19(నమస్తే తెలంగాణ) : మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి పాల్పడిన కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్‌ను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు మల్టీజోన్-1 ఐజీ ఏ.వి రంగనాథ్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం పాత పోలీస్‌స్టేషన్ బిల్డింగ్ రెండో అంతస్తులో ఎస్ఐ, గ్రౌండ్ ఫ్లోర్లో మహిళా కానిస్టేబుల్ నివాసం ఉంటున్నారని, రెండుసార్లు మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించి లైంగిక దాడి చేసినట్లు విచారణలో వెల్లడి కావడంతో ఎస్ఐపై యూ/ఎస్ 449, 376(2)(ఎ)(బి) 324, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావును ఎస్పీ కిరణ్ ఖరె విచారణ అధికారిగా నియమించగా నివేదిక ఆధారంగా ఎస్ఐని అరెస్టు చేశారని, బుధవారం భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ అడిషనల్ జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరిచినట్లు ఐజీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్ఐ తన హోదాను అడ్డుపెట్టుకుని పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలను దిగజార్చేలా వ్యవహరించడంతో భవానీసేన్‌పై ఎలాంటి విచారణ లేకుండానే ఆర్టికల్-311 ప్రకారం సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు వెల్లడించారు.