వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 26: కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ) భవిష్యత్ బంగారుమయంగా మారుతుందనడంతో ఎలాంటి అనుమానం లేదని ఐఎంఏ ఎథికల్ కమిటీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ శేషుమాధవ్, కాకతీయ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్ఫర్మేటివ్ ఇన్నోవేషన్స్ (క్రితి)-24 కన్వీనర్ డాక్టర్ సుజిత్ ఆర్ పున్నం అన్నారు.
శనివారం నిర్వహించిన క్రితి-24 ముగింపు వేడుకలను వారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మా ట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్థుల ఆలోచనలను పంచుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ రీసెర్చ్ డే వేడుకలు కళాశాలకు దేశవ్యాప్త గుర్తింపును తీసుకువచ్చాయన్నారు. ఈ సందర్భంగా దేశంలో వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాళీప్రసాద్ మాట్లాడుతూ ఇచ్చిపుచ్చుకోవడమనే విధానంతో ముడిపెట్టి జ్ఞాన పరంపరను పెంపొందించుకోవడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు.
ఏఏపీఐ అధ్యక్షుడు డాక్టర్ సతీశ్ కత్తుల, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్య, నర్పంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్లు నిర్వాహక కమిటీని, పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ విభాగాధిపతులు, వైద్యాధికారులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.