వరంగల్, మే 28 (నమస్తే తెలంగాణ): మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను కృత్రిమ కొరత సృష్టిస్తున్న వరంగల్‌లోని విత్తన దుకాణాలపై వ్యవసాయశాఖ, పోలీస్ టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మేందుకు విత్తన డీలర్లు అక్రమంగా నిల్వ చేసిన రూ.3,67,100 విలువైన పత్తి విత్తన ప్యాకెట్లను చేశారు. వరంగల్ స్టేషన్‌రోడ్డులోని ఓల్డ్ గ్రేన్ మార్కెట్ ప్రాంతంలో రఘురామ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణంలో సరైన బిల్లులు, రికార్డులు చూపకుండా కృత్రిమ కొరత సృష్టించేందుకు అక్రమంగా నిల్వ చేసిన రూ.2,72,160 విలువైన యూఎస్ 7067 అనే బ్రాండ్‌కు చెందిన 315 పత్తి విత్తనాల ప్యాకెట్లను గుర్తించారు. స్థానిక వ్యవసాయ అధికారి విజ్ఞాన్ సమక్షంలో సీజ్ చేసి విచారణ కోసం ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించారు. ఈ దుకాణం యజమానులు గోనె సుధాకర్, లక్కర్సు పూర్ణచందర్గా అధికారులు తెలిపారు. అనంతరం వరంగల్ ఫోర్ట్‌రోడ్డులోని ఏకశిలనగర్‌లో మేరీ మాత సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణం యజమాని అల్లం విజయభాస్కర్‌రెడ్డి ఇంటి ఆవరణలో ఆకస్మిక తనిఖీలు చేసి రూ.31,968 విలువైన వివిధ బ్రాండ్లకు చెందిన 37 పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకొని సీజ్ చేశారు.
వరంగల్ స్టేషన్‌రోడ్డులోని సీతారామ కాంప్లెక్స్‌లో ఉన్న మేరీ మాత సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ దుకాణం యజమాని విజయభాస్కర్‌రెడ్డి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మేందుకు పత్తి విత్తన ప్యాకెట్లను తన ఇంటి ఆవరణలో అక్రమంగా నిల్వ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన పత్తి విత్తన ప్యాకెట్లలో యూఎస్ 7067, సదానంద్, సూపర్ బంటి, సీసీహెచ్-369-బీజీ-2, నవనీత్, ఆధ్య, సంకెట్ బ్రాండ్లకు చెందినవి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విచారణ కోసం ఈ విత్తనాలను మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. ఖిలావరంగల్ మండలం బొల్లికుంట రామకృష్ణాపురంలోని మహాలక్ష్మి సీడ్స్, ఫర్టిలైజర్ దుకాణం యజమాని మల్లిపెద్ది దేవకుమార్ ఇంటి ఆవరణలో అక్రమంగా నిల్వ ఉన్న రూ.63,072 విలువైన 73 పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకుని సీజ్ చేశారు. వీటిలో యూఎస్ 7067, నూజివీడు ఆధ్య, నాథ్ సాంకేట్ బ్రాండ్ల విత్తనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ప్రభుత్వం నిషేదించిన రూ.58వేల విలువైన గడ్డిమందు బాటిళ్లను అక్రమంగా నిల్వ చేయగా సీజ్ చేసినట్లు చెప్పారు. విచారణ కోసం ఈ విత్తనాలు, గడ్డిమందు బాటిళ్లను మామునూరు పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఉషాదయాళ్, ఏడీఏ కే నగేశ్, ఏవో విజ్ఞాన్, టాస్క్‌ఫోర్స్ సీఐలు ఎస్ రవికుమార్, ఎస్సైలు నిస్సార్‌పాషా, శరత్ పాల్గొన్నారు.