కొనసాగుతున్న చెన్నకేశవస్వామి, లక్ష్మీనర్సింహస్వామి జాతర
వైభవంగా కంఠమహేశ్వరస్వామి ఉత్సవాలు
కనుల పండువగా స్వామివార్ల కల్యాణం
ఆలయాల చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షిణ
ఆకట్టుకుంటున్న ప్రభబండ్లు
దామెర, మార్చి 29 : హోలీ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని వివిధ ఆలయాల్లో నిర్వహించే జాతర, ఉత్సవాలు, కల్యాణోత్సవాలు కనుల పండువగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దామెర మండలంలోని కోగిల్వాయి చంద్రగిరి చెన్నకేశవస్వామికి సోమవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన గుట్టపైకి చేరుకుని శ్రీదేవి, భూదేవీసహితంగా కొలువై ఉన్న స్వామిని దర్శించుకున్నారు. పసుపు, కుంకుమ, కొబ్బరి, నైవేద్యం, నూతన వస్ర్తాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. స్వామికి ఆలయ ప్రధాన అర్చకుడు దివి వెంకటజోగాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం విశేష అభిషేకాలు చేశారు. జాతరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని దామెర పోలీసులు సూచిస్తూ, మాస్కు ఉంటేనే గుట్టపైకి అనుమతిస్తున్నా రు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు జాతర కమిటీ చైర్మన్ మౌటం రఘు పేర్కొన్నారు. ఆలయ శాశ్వత అభివృద్ధి కమిటీ చైర్మన్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గట్ల విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ సంగనబోయిన మౌనికాకిరణ్, మండల కోఆప్షన్ సభ్యుడు అక్తర్, ఉపసర్పంచ్ గోల్కొండ సాంబయ్య, వార్డు సభ్యులు నాగరాజు, ప్రశాంత్, కారోబార్ సురేశ్, అర్చకులు మురళీధరాచార్యులు, కేశవాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు పాల్గొన్నారు.
కోలాహలంగా కోనాపురం జాతర
చెన్నారావుపేట: కోనాపురం గుట్టపై వెలసిన శ్రీలక్ష్మీనర్సింహ స్వామి జాతర ఆదివారం సాయంత్రం భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయగా జాతర ఉత్సవాలు ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్నది. ఎస్సై శీలం రవి ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు మధ్య భక్తులు గుట్ట చుట్టూ ఎడ్లబండ్ల ప్రభలతో ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకున్నారు. చెన్నారావుపేట, అక్కల్చెడ, ఉప్పరపల్లి, ఈర్య తండా, కాల్నాయక్తండా, గొల్లపల్లె, జీడీ గడ్డతండా నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పూజల్లో ఆలయ ప్రధానార్చకుడు కసివొజ్జుల శివకృష్ణాచార్యులు, సర్పంచ్ వెల్దె సుజాతాసారంగం, ఎంపీటీసీ గుండాల మహేందర్, ఉప సర్పంచ్ మండల నర్సింహారాములు పాల్గొన్నారు. అలాగే, పదహార్చింతల్ తండాలోని నక్కలగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి సైతం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నట్లు సర్పంచ్ అంగోత్ శారద, ఆలయ నిర్మాణ దాత బోడ బద్దూనాయక్ తెలిపారు.
లక్ష్మీనర్సింహస్వామి జాతరకు పోటెత్తిన భక్తులు
దుగ్గొండి: గీసుగొండ మండలం కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు దుగ్గొండి మండలంలోని గ్రామాల నుంచి భక్తులు ఎడ్లబండ్లలో తరలివెళ్లారు. మండలంలోని నాచినపల్లి, తొగర్రాయి, మందపలి,్ల రాజ్యాతండా, గ్రామాల నుంచి భక్తు లు ద్విచక్రవాహనాలను ప్రభలుగా మార్చి, మరికొందరు గుర్రపుబండ్లు, ఏనుగుబండ్లు, మేకపోతుల ప్రభబండ్లతో జాతరకు తరలివెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆనవాయితీగా వస్తున్న ప్రభలను ఎడ్లబండ్ల ద్వారా కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి ఇవ్వగా, డప్పు చప్పుళ్లతో తరలివెళ్లారు. సీఐ సతీశ్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై రవికిరణ్, పోలీసులు బందోబస్తు నిర్వహంచారు.
ఘనంగా కంఠమహేశ్వరస్వామి ఉత్సవాలు
ఆత్మకూరు: మండలంలోని నీరుకుళ్లలో కంఠమహేశ్వరస్వామి ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. గౌడ కులస్తులు ఉదయం ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి కొత్త బిందెలతో పాలు, పెరుగు తేనె, నెయ్యి చక్కెర, హారతులు, కొబ్బరి కాయలతో ఆలయానికి చేరుకుని వినాయకుడికి పూజలు చేశారు. అనంతరం కంఠమహేశ్వర స్వామికి భక్తులు పాలాభిషేకం చేశారు.
కమనీయం… స్వామి వార్ల కల్యాణోత్సవం
రాయపర్తి: మండలంలోని బందన్‌పల్లి, కొండాపురం గ్రామాల్లో సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి, రుక్మిణి, సత్యభామ సమేత చెన్నకేశవస్వామి కల్యాణోత్సవాలు ఆదివారం రాత్రి వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయాల అభివృద్ధి కమిటీలు, ఉత్సవ మండళ్ల నిర్వహణలో కనుల పండువగా నిర్వహించారు. మండలంలోని కొండాపురం గ్రామస్తులు చెన్నకేశవస్వామి, బందన్పల్లిలో సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సర్పంచ్‌లు కోదాటి దయాకర్‌రావు, భూక్యా దీప్లానాయక్, ఆలయాల అభివృద్ధి కమిటీల బాధ్యులు, పండితులు, సేవకులు, భక్తులు పాల్గొన్నారు.