కమలాపూర్ మండలాన్ని దత్తత తీసుకుంటా
ఇక పెళ్లి పీటలమీదనే కల్యాణక్ష్మి చెక్కులు..
ఒక్కో మహిళకు రూ.3లక్షల రుణాలు ఇస్తాం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కమలాపూర్ జూన్ 28: ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చెప్పుకుని కొందరు సంపాదించుకున్నరని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి అన్నారు. సోమవారం కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు 74లక్షల 8వేల విలువైన 74కల్యాణలక్ష్మి, 3 లక్షల 70 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల కోసం డబ్బులిస్తే ‘నేనే చేశానని చెప్పుకుంటున్నారని, ఇది అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఉంది’ అని పేర్కొన్నారు. కేసీఆర్ దయవల్లే ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని గుర్తు చేసుకోవాలని సూచించారు. కమలాపూర్ మండలాన్ని దత్తత తీసుకుంటానని, ఇక నుంచి పెళ్లి పీటలమీదనే కల్యాణలక్ష్మి చెక్కు అందేలా చూడాలని సర్పంచ్‌లను ఆదేశించారు. మహిళా సంఘాల్లోని ఒక్కో మహిళకు స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షల రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, రుణం తీసుకున్న మహిళ అనివార్య కారణాల వల్ల చనిపోతే మాఫీ చేస్తామన్నారు. రుణం చెల్లించి మధ్యలోనే చనిపోతే కట్టిన డ బ్బు లు తిరిగి వాపసు ఇస్తామని ప్రకటించారు. బ్యాంకు లోన్ల ద్వారా ఒక్కో ఎస్సీ కుటుంబానికి రూ.10లక్షల రుణాలు అందజేస్తామన్నారు. ముఖ్యమంత్రి దళితుల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. బీసీ, ఎస్సీ యువకులకు ఏదైనా పని చేసుకుంటామంటే రూ.5లక్షల సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సొంత జాగలో ఇల్లు కట్టించ్చేందుకు సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారని, గ్రామానికి 40 నుంచి 50 ఇండ్లు నిర్మాణం చేయిస్తానని వెల్లడించారు.
‘పల్లె ప్రగతి’పై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
జూలై ఒకటి నుంచి ప్రారంభమయ్యే పల్లెప్రగతి పనులపై నిర్లక్ష్యం చేస్తే సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తప్పవని మంత్రి దయాకర్‌రావు హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిని ఛాలెంజ్‌గా తీసుకున్నారని, ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం ఉండాలన్నారు. ప్రతి రోజూ ట్రాక్టర్‌తో చెత్తను తరలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని, మండలంలో పల్లె ప్రగతిలో మొదటి స్థానంలో నిలిచిన గ్రామానికి రూ. 25లక్షల నిధులు కేటాయిస్తానని ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, దేశంలో బీజేపీ పాలిత 15 రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి ఇస్తున్నారా.. అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రెండు పంటలకు సాగునీరు ఇస్తున్నారని, దీంతో భూగర్భజలాలు సైతం పెరిగాయన్నారు. రైతులకు నిరంతరం ఉచిత కరంటు ఇస్తున్నారని, చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ జావేద్ పాషా, ఎంపీడీవో పల్లవి, జడ్పీటీసీ కల్యాణి, సర్పంచ్ కట్కూరి విజయ, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సంపత్‌రావు, సింగిల్ విండో చైర్మన్ సంపత్‌రావు, పరకాల ఎంపీపీ స్వర్ణలత, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, రైతుబంధు సమితి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.