బండకింద సమిధలైన 10 మంది కార్మికులు
ఇప్పటికీ కోలుకోని బాధిత కుటుంబాలు
యైటింక్లయిన్కాలనీ, అక్టోబర్ 16 : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ – 2 పరిధిలోని 8ఏ గనిలో 16, అక్టోబర్ 2003లో అర్ధరాత్రి సంభవించిన ఘోర ప్రమాదంలో 10 మంది కార్మికులు బండ కిందే సమిధలయ్యారు. ఆనాడు జరిగిన ఈ ఘటనపై బాధిత కుటుంబాలు, తోటి కార్మికులు నేటికీ తేరుకోవడం లేదు. నాటి ప్రమాదంలో మరణించిన కార్మికుల స్మారకార్థం 8ఏ గని స్మారక స్తూపాన్ని నిర్మించారు. మృతుల కుటుంబాల సభ్యులు స్మారక స్తూపం వద్ద ఆదివారం స్మారక సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదం జరిగి నేటితో 18 యేండ్లు గడుస్తున్నది. అధికారుల నిర్లక్ష్యానికి భారీ ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు మృతి చెందినా బాధ్యులపై యాజమాన్యం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై బాధిత కుటుంబాలు, తోటి కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే యాజమాన్యం కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ నిర్వహించి కోర్టులో దాఖలైన గానీ, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ నివేదికను బహిర్గతపరిచి బాధ్యులపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు వీరే..
8ఏ గని ప్రమాదంలో బండ కూలి 10 మంది కార్మికులు మృతి చెందారు. వారిలో మైనింగ్ సర్దార్ లంబు మల్లయ్య, కోల్కట్టర్ కార్మికులు ఆడప అశోక్, మీనుగు చంద్రయ్య, టింబర్మెన్ కార్మికులు పిడుగు కొమురయ్య, మంధని రాజం, మామిడి మల్లేశ్, కోల్ఫిల్లర్ కార్మికులు కన్నూరి రాయమల్లు, కాశెట్టి నారాయణ, రాగుల నర్సింగరావు, తోట బాబు ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఈ ఘటన నుంచి కోలుకోవడం లేదు