ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో 60 మద్యం షాపులు
27 దుకాణాలకు రిజర్వేషన్ వర్తింపు
33 షాపులు ఓపెన్ కేటగిరీకి
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఈసారి కొత్తగా గౌడ కులస్తులకు రిజర్వేషన్
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 8 (నమస్తేతెలంగాణ) : నూతన ఆబ్కారి విధానంలో భాగంగా జిల్లాలోని రిటైల్ మద్యం షాపులకు 2021-23 సంవత్సరాలకు గాను రిజర్వేషన్ను కలెక్టర్ భవేశ్ మిశ్రా సోమవారం కలెక్టర్ చాంబర్లో లాటరీ విధానంలో కేటాయించారు. షెడ్యూల్డ్ ఏరియా లో ఉన్న 11 మద్యం షాపులను మినహాయించి మిగిలిన 49 షాపులకు రిజర్వేషన్ కేటాయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. 49 షాపులకు లాటరీ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ చేపట్టగా కమిటీ సభ్యులుగా జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, షెడ్యూల్డ్ కులా ల అభివృద్ధి అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆధ్వర్యంలో లాటరీ తీసి దుకాణాలను కేటాయించారు.
రిజర్వేషన్లో 27 మద్యం షాపులు
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెండు జిల్లాలోని 60 మద్యం షాపులకు గాను 27 మద్యం షాపులను రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. ఇందులో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్లో భాగంగా 9 షాపులను, ఎస్సీ కేటగిరీకి 7 షాపులు, షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న 11 షాపులకు రిజర్వేషన్ కేటాయించారు.
గౌడ కులస్తుల షాపులివే..
రిజర్వేషన్లో భాగంగా జిల్లాలోని గౌడ కులస్తులకు 8,11,23,32,33,34,36,42,46 షాపులను కేటాయించారు.
ఎస్సీ విభాగంలో..
ఎస్సీ విభాగంలో భాగంగా జిల్లాలోని ఎస్సీ కులస్తులకు 14,22,38,43,45,47,48 షాపులను కేటాయించారు. ఎస్టీలకు కేటాయించిన (షెడ్యూల్డ్ ఏరి యా) 11 షాపులు : 50 నుంచి 60 వరకు.
జనరల్ కేటగిరిలో ఉన్న మద్యం షాపులు 33. ఈ షాపులకు అందరు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. మద్యం షాపుల రిజర్వేషన్లను పారదర్శకంగా కేటాయించడంతో పాటు డ్రా పద్ధతిని వీడియో చిత్రీకరణ చేసినట్లు ఆయన తెలిపారు.
పెరిగిన మద్యం షాపుల సంఖ్య
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని 4 ఎక్సైజ్ సర్కిళ్లలో గతంలో (ములుగు, ఏటూరునాగారం, భూపాలపల్లి, కాటారం) 55 మద్యం షాపులు ఉన్నాయి. ప్రస్తుత 2021-23 సంవత్సరంలో మరో 5 మద్యం షాపులను అదనంగా పెంచారు. ప్రస్తుతం రెండు జిల్లాల పరిధిలో 60 మద్యం షాపులు డిసెంబర్ 1వ తేదీ నుంచి నిర్వహించేలా టెండర్ ప్రక్రియను చేపట్టేందుకు దరఖాస్తు గడువు ప్రకటించారు.
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని 60 మద్యం షాపుల నిర్వహణకు ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసేవారు ఫీజు రూ. 2లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 18వ తేదీన డ్రా నిర్వహించి షాపులను కేటాయించానున్నారు. ఈ నెల 20వ తేదీన డ్రాలో షాపులు పొందిన వారికి ప్రొవిజనల్ లైసెన్స్లు జారీ చేయనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి నూత న ఆబ్కారీ విధానం అమలులోకి రానున్నది.