జయశంకర్ జిల్లాకు 1391 మంజూరు.. 281 పూర్తి
చివరి దశలో మిగిలిన నిర్మాణాలు
సద్వినియోగం చేసుకుంటున్న రైతులు
రూ.1.68 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం
భూపాలపల్లి టౌన్, నవంబర్ 7 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నూర్పిడి అనంతరం అకాల వర్షాలు కురియడంతో తడిసి ముద్దవుతున్నాయి. దీంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. పంట కోసిన అనంతరం ఆరబెట్టుకునేందుకు సరైన సౌకర్యాలు లేకఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అన్నదాత కష్టాలను దూరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి పంట పొలాల్లోనే కల్లాలను నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నది. ఇందు కోసం ఉపాధి హామీ పథరం ద్వారా నిధులు వెచ్చిస్తోంది. దీంతో కల్లాల నిర్మాణాకి అన్నదాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి సంవత్సరం చేతికొచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. రోడ్లపై ఆరబెట్టడంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సరైన ప్రదేశంలో ఆరబెట్టకపోవడంతో వర్షాలు కురిసి పంట మొత్తం నీటి పాలవుతుంది. పండించిన పంటను పంట చేలు వద్ద నుంచి మరో చోటికి చేర్చడం, అక్కడి నుంచి ధాన్యాన్ని సిద్ధం చేసి మార్కెట్కు తీసుకెళ్లడం రైతుకు ఆర్థికంగా ఇబ్బంది మారుతున్నది. వీటికి చెక్ పెట్టేందుకే రైతులు తమ పంట పొలాల్లోనే కల్లాలు నిర్మించుకునేలా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
మూడు రకాల్లో కల్లాల నిర్మాణం
రైతులు పొలాల్లో మూడు రకాల్లో కల్లాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. చదరపు మీటర్ల ప్రకారం కల్లాలు నిర్మించుకోవాల్సి ఉంటుంది. 50 స్కేర్ ఫీట్ల కల్లం నిర్మాణానికి రూ. 58 వేలు, 60 స్కేర్ ఫీట్ల కల్లం నిర్మాణానికి రూ. 68 వేలు, 75 స్కేర్ ఫీట్ల కల్లం నిర్మాణానికి రూ. 85 వేలు ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు చేస్తోంది. కల్లాలు నిర్మించుకునేలా అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 1391 కల్లాలు మంజూరు కాగా ఇందులో 281 పూర్తయ్యాయి. మిగిలిన కల్లాల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. 1391 కల్లాలకు ప్రభుత్వం రూ. 1.68 కోట్లు మంజూరు చేసింది.
1391 కల్లాలు మంజూరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల్లో 1391 కల్లాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 790 నిర్మాణంలో, 320 ప్రారంభ దశలో ఉండగా 281 పూర్తయ్యాయి. భూపాలపల్లి మండలానికి 131 కల్లాలు మంజూరయ్యాయి. చిట్యాల మండలానికి 303, గణపురానికి 128, కాటారానికి 78, మహదేవపూర్కు 53, మల్హర్కు 139. మొగుళ్లపల్లికి 119, మహాముత్తారానికి 33, పలిమెలకు 3, రేగొండకు 172, టేకుమట్లకు 232 కల్లాలు మంజూరయ్యాయి. సగానికి పైగా నిర్మాణ దశలో ఉండగా, 281 పూర్తై రైతులు వినియోగించుకుంటున్నారు.
రైతులకు మంచి అవకాశం..
ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన పథకం ఇది. దీనిని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధి హామీ పథకం అధికారుల సమన్వయంతో కల్లాల నిర్మాణం కొనసాగుతుంది. పంట చే ల వద్దే కల్లాలు నిర్మించుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీంతో రైతులు తమ పంటను చేలు వద్దే ఆరబెట్టుకోవడం, తూర్పాల పట్టుకోవడం సులభతరమవుతుంది. అక్కడి నుంచే నేరుగా పం టను అమ్ముకోవచ్చు. 281 కల్లాలు పూర్తయ్యా యి. మిగిలిన కల్లాలు నిర్మాణంలో ఉన్నాయి. మరో రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
-పురుషోత్తం, డీఆర్డీవో