ఎనుమాముల మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న ధర
క్వింటాల్ పత్తికి రూ. 9705 ధర
సంబుర పడుతున్న రైతులు
మార్కెట్ చరిత్రలోనే రికార్డు అంటున్న అధికారులు, వ్యాపారులు
కాశీబుగ్గ, జనవరి 5: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారం మెరుస్తున్నది. ఈ సీజన్ అక్టోబర్ నుంచి ప్రారంభం కాగా, అత్య ధికంగా రికార్డు స్థాయిలో పత్తికి ధర పలుకుతోంది. బుధవారం క్వింటాల్‌కు రూ. 9705 రేటు ఉండగా, ఇప్పటి వరకు మార్కెట్ చరిత్రలోనే ఇంత ధర పలుకలేదని అధికారులు, వ్యాపారులు అంటున్నారు. రైతులు ఉహించిన దాని కంటే అధికంగానే ధరలు ఉండడంతో కాస్త ఊరట కలిగింది. ఈ సీజన్లో కాలం కలిసిరాక, ప్రారంభంలోనే గులాబీ పురుగు సోకడంతో చాలా వరకు పత్తి దిగుబడి తగ్గింది. దీంతో చేతికి వచ్చిన పంటకు కాస్త ఎక్కువ ధర రావడం తో రైతులు సంబుర పడుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కా మారం గ్రామానికి చెందిన పాయం సాంబశివరావు 8 బస్తాల పత్తిని మార్కెట్ కు తీసుకువచ్చాడు. తారక ట్రేడర్స్ అడ్తి కమిషన్ ద్వారా మహాలక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ ఖరీదు వ్యాపారి క్వింటాల్‌కు రూ.9705 ధరతో కొనుగోలు చేశాడు. ఈ సీజన్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్‌కు 3 లక్షల 75వేల 901 క్వింటా ళ్ల పత్తి రాగా, బుధవారం 3,970 క్వింటాళ్లు వచ్చింది. అత్యధికంగా రూ. 9705, మధ్యరకానికి రూ.9150, కనిష్ఠంగా రూ 7500 ధరలు పలికాయి.