తాడ్వాయి, జనవరి 5 : మేడారం సమ్మక్క-సారలమ్మలకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. అమ్మవార్ల మహాజాతర సమీపిస్తుండటంతో భక్తులు అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. బుధవారం సారలమ్మ దేవత గద్దెపై కొలువుదీరే రోజు కావడంతో తెలంగాణ రాష్ట్రంతోపాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకున్నారు. సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకు మ, ఎత్తుబెల్లం, చీరె, సారె, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
మేడారంలో పార్కింగ్ స్థలాల చదును
మేడారం జాతర పరిసరాల్లో వాహనాల పార్కింగ్ స్థలాల చదును చేయడం బుధవారం ప్రారంభమైంది. వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మల మహాజాతర సందర్భంగా వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఊరట్టం స్తూపం వద్ద సుమారు 30 ఎకరాల పంట భూములను డోజర్లతో చదును చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ఇతర వ్యక్తులకు పొలాలను అప్పగిస్తే తమకు అన్యాయం జరుగుతున్నదని గతంలో రైతులు చెప్పారు. దీంతో రైతులే చేయాలని కలెక్టర్ ఆదేశించగా వారే పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు.