వరంగల్ రూరల్, జూలై 7(నమస్తే తెలంగాణ) : పల్లెల సమగ్రాభివృద్ధి కోసం తండాలు, గూడేలు, శివారు పల్లెలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పంచాయతీలుగా మార్చింది. అదే సమయంలో నల్లబెల్లి మండలంలో బుచ్చిరెడ్డిపల్లి కొత్త పంచాయతీగా అవతరించింది. గతంలో ఇది కన్నారావుపేట ఉమ్మడి పంచాయతీ పరిధిలో ఉండేది. దీంతో ఈ గ్రామం అప్పట్లో అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ అనేక సమస్యలు తిష్ట వేశాయి. ఈ క్రమంలో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడి, 2020 ఫిబ్రవరి 2న సర్పంచ్ లూనావత్ వెంకన్న నేతృత్వంలో ఎనిమిది మంది వార్డు సభ్యులతో తొలి పాలకవర్గం కొలువుదీరింది. ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తేవడంతో పాటు పల్లెల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పల్లె ప్రగతిని రూపొందించింది. 2020 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు నెల పాటు తొలి విడుత ఈ కార్యక్రమం నిర్వహించింది.
అభివృద్ధి కోసం కలిసికట్టుగా..
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు బుచ్చిరెడ్డిపల్లి ప్రజలు తమ ఊరి ప్రగతికి నడుం కట్టారు. మహిళలు, యువకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పల్లె ప్రగతిలో భాగస్వాములయ్యారు. పరిసరాల పరిశుభ్రత కోసం శ్రమదానం చేశారు. తొలుత గ్రామంలోని పెంటకుప్పలను తొలగించారు. రోడ్లపై ఉన్న గుంతలను మట్టితో పూడ్చివేశారు. జనావాసాల మధ్య ఉన్న పిచ్చిమొక్కలను, శిథిల ఇండ్లను కూల్చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. పచ్చదనం, పరిశుభ్రతకు కేరాఫ్‌గా మార్చారు.
ఆదాయాన్నిచ్చేలా మొక్కల పెంపకం
గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరేందుకు గ్రామంలో జామ, నిమ్మ మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీ నర్సరీ, కమ్యూనిటీ ప్లాంటేషన్ కోసం రెండెకరాల స్థలాన్ని గుర్తించారు. ఒక ఎకరంలో కమ్యూనిటీ ప్లాంటేషన్ కింద 896 మొక్కలు నాటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వాచర్‌ను నియమించారు. జామ పండ్లు, నిమ్మకాయలతో సంవత్సరానికి రూ.లక్ష ఆదాయం రావాలన్నది గ్రామ పంచాయతీ లక్ష్యం. అవెన్యూ ప్లాంటేషన్ కింద గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు.
896 మొక్కలతో మంకీ ఫుడ్‌కోర్టు
గ్రామాల్లోకి వస్తున్న కోతుల కోసం రెండెకరాల్లో మంకీ ఫుడ్‌కోర్టు ఏర్పాటుచేశారు. నేరేడు, జామ, ఉసిరి, సీతాఫలం, వెలగ వంటివి 896 పండ్ల మొక్కలు నాటి, ఒకవైపు నీటికుంట నిర్మించారు. ప్రత్యేకంగా కనిపించేలా ఇందులో తామర పూలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వంద శాతం అమలు
పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామంలో పక్కాగా అమలుకావడంతో వంద శాతం ఫలితాలు సాధించింది. ఎంపీవో కూచన ప్రకాశ్ చొరవతో స్థానికుడు లునావత్ భోజ్య ముందుకొచ్చి ఒక ట్రాక్టర్, ట్యాంకర్‌ను జీపీకి అందించారు. వీటిని గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత కోసం ఉపయోగిస్తున్నారు. చెత్త సేకరణ కోసం ఇంటింటికీ చెత్తబుట్టలు పంపిణీ చేశారు. గ్రామ శివారులో డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠధామం నిర్మించారు. పంచాయతీ సిబ్బంది తడి, పొడి చెత్తను వేరుచేస్తున్నారు. తడి చెత్తతో డంపింగ్‌యార్డులో వర్మీ కంపోస్టు తయారు చేసి హరితహారం మొక్కలకు వాడుతున్నారు. పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులన్నీ 100 శాతం పూర్తి చేయడంతో పాటు నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నారు.
ఆకట్టుకునేలా ఆక్సిజన్ పార్కు
పల్లె ప్రకృతి వనం కోసం అధికారులు బుచ్చిరెడ్డిపల్లిలో 20గుంటల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. సర్పంచ్ లునావత్ వెంకన్న, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి ఈ స్థలంలో రెండు వేల మొక్కలు నాటారు. వీటిలో మర్రి, గుల్మొహర్, రావి, నెమిలినార, వెలగ సహా ఇరవై రకాల అటవీ మొక్కలు, మామిడి, జామ మొక్కలు ఉన్నాయి. సిమెంట్, ఐరన్‌తో కాకుండా ఎండిన చెట్ల కొమ్మలు, కర్రలనే ప్రవేశమార్గంగా ఏర్పాటుచేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాదాద్రి తరహాలో తక్కువ స్థలంలో తక్కువ ఖర్చుతో నేచురల్‌గా తీర్చిదిద్దడంతో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కేసీఆర్ కల నిజం చేస్తం..
మా పల్లె జనాభా 591. ఇక్కడ 97శాతం మంది గిరిజనులే. తండాలు అభివృద్ధి చెందాలనే సీఎం కేసీఆర్ తండాలు, గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఆయన కల నిజం చేయడం కోసం మా ఊరి ప్రజలంతా కలిసికట్టుగా కదులుతున్నారు. ప్రభుత్వం తలపెట్టే ప్రతి కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేస్తున్నారు. గ్రామం రూపురేఖలు మార్చేస్తున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులు నాపై నమ్మకంతో గెలిపించారు. వారి రుణం తీర్చుకోవడం బాధ్యతగా భావిస్తున్నా.
సమష్టి కృషి వల్లే..
కొత్త పంచాయతీరాజ్ చట్టంతో సీఎం కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. తండాలను జీపీలు చేయాలనే గిరిజనుల కోరిక తీర్చారు. సీఎం కేసీఆర్ వారి ఆకాంక్ష నెరవేర్చినందుకు బుచ్చిరెడ్డిపల్లి ప్రజలు ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా విజయవంతం చేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా సమష్టి నిర్ణయాలతో అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతున్నారు. పల్లె ప్రగతితో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ సక్సెస్ చేస్తున్నారు.