దుగ్గొండి/నర్సంపేటరూరల్/ఖానాపురం, జూన్ 4: పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శనివారం గ్రామాల్లో జోరుగా పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వీధులను శుభ్రం చేయడంతోపాటు డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. ఇందులో భాగంగా దుగ్గొండి మండలంలో పచ్చదనం- పరిశుభత్రపై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య పలు గ్రామాల్లో పర్యటించి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి సారించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని కోరారు. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, తాసిల్దార్ సంపత్‌కుమార్, ప్రత్యేకాధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు. నర్సంపేట మండలవ్యాప్తంగా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు పారిశుధ్య పనులు చేశారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శుల ఆధ్వర్యంలో సిబ్బంది డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగునీటిని తొలగించారు.
రామవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్య పనులు, శ్మశాన వాటికను ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్ పరిశీలించారు. పని ప్రదేశానికి వెళ్లి ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. లక్నేపల్లి, గురిజాల, పర్శనాయక్‌తండా, నాగుర్లపల్లి, కమ్మపల్లిలో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో పరిశీలించారు. పర్శనాయక్‌తండా, కమ్మపల్లి, ఇటుకాలపల్లి, ముగ్ధుంపురం, రాములునాయక్తండాలో పారిశుధ్య పనులను సర్పంచ్‌లు బానోత్ గాంధీ, వల్గుబెల్లి రంగారెడ్డి, మండల రవీందర్, పెండ్యాల జ్యోతి, మాధవి పర్యవేక్షించారు. ఖానాపురం మండలంలో రెండో రోజు పిచ్చిమొక్కల తొలగింపు, పారిశుధ్య పనులు చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమనావాణి, ప్రత్యేకాధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
రాయపర్తి/నెక్కొండ: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులు పరిశుభ్రత పాటించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు కోరారు. మండలంలోని 39 గ్రామాల్లో శనివారం ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులు చేశారు. సర్పంచ్‌లు, గ్రామాల ప్రత్యేకాధికారుల సారథ్యంలో పంచాయతీ సిబ్బంది, ఉద్యోగులు, పాలక మండలి సభ్యులు రెండో రోజు వార్డులు, వీధులు, కాలనీల్లో పర్యటించి సమస్యలను గుర్తించడంతోపాటు గ్రామస్తుల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించారు.
కొండూరులో సర్పంచ్ కర్ర సరితా రవీందర్‌రెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్ నేతృత్వంలో ఇంటి పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచిన గృహ యజమానులకు నోటీసులు జారీ చేశారు. పెర్కవేడులో సర్పంచ్ చిన్నాల తారాశ్రీ రాజబాబు నేతృత్వంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల సముదాయాలను శుభ్రం చేశారు. కార్యక్రమాల్లో కార్యదర్శులు నిమ్మల రాజ్‌కుమార్, అజ్మీరా వెంకటేశ్, సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.
నెక్కొండ మండలంలోని గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. శనివారం అలంకానిపేట డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్తను వేరు చేసే పనులను సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి పరిశీలించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుంటుక నర్సయ్య, కార్యదర్శి మధు, వార్డు సభ్యులు చీకటి యాకలక్ష్మి, ఉపేందర్, యూత్ నాయకులు సముద్రాల మల్లికార్జున్ పాల్గొన్నారు. మహబూబ్నాయక్తండాలో సర్పంచ్ పూర్ణ, ఉప సర్పంచ్ హరిలాల్, కార్యదర్శి రవి శ్మశాన వాటికను శుభ్రం చేయించారు.
గీసుగొండ: పల్లెప్రగతి కార్యక్రమంతోనే గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతున్నాయని జడ్పీటీసీ పోలీసు ధర్మారావు అన్నారు. మండలంలోని ఊకల్ గ్రామంలో శనివారం ఆయన పర్యటించి పనులను పరిశీలించారు. పారిశుధ్య పనులు పక్కాగా జరుగాలని జీపీ సిబ్బందికి సూచించారు. గ్రామంలో మొక్కల పెంపకాన్ని చేపట్టాలన్నారు. ఊకల్ అభివృద్ధికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అత్యధిక నిధులు కేటాయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలతో పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ మొగసాని నాగదేవత, ఎంపీటీసీ బేతినేని వీరారావు, ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.