లింగాలఘనపురం, జూన్ 19: డ్రాగన్ ఫ్రూట్ సాగు లాభాల పంట పండిస్తున్నది. ఆర్గానిక్ పద్ధతిలో జీడికల్లో ఆదర్శ రైతు ఏడాది క్రితం ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టగా ఏడాదిలో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా ఆదాయం పొందాడు. డ్రాగన్ ఫ్రూట్ పండించాలనుకునే రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.5లక్షల సబ్సిడీ అందిస్తున్నది.
జనగామ జిల్లాలోని జీడికల్లో ఏడాదిన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఆర్గానిక్ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టింది. ఆదర్శ రైతు వెంకన్నను ఎంపిక చేసి సబ్సిడీ అందించింది. 25 ఏళ్ల్లపాటు దిగుబడులు రానుండగా మూడో ఏట నుంచి సగటున ఏడాదికి రూ.8లక్షల నుంచి రూ.9లక్షల దాకా ఆదాయం వస్తుంది. వెంకన్న కుటుంబం 30 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నది. ఈ క్రమంలో ఐదేళ్లుగా విజయనగరం, నెల్లూరు, రాజేంద్రనగర్ తదితర వ్యవసాయ కమతాలకు వెళ్లి అక్కడ డ్రాగన్ ఫ్రూట్ సాగుపై అధ్యయనం చేశాడు.
థాయిలాండ్ వాసులు చేసే డ్రాగన్ ఫ్రూట్ సాగు విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కోల్కత్త, ముంబైకే పరిమితమైన ఈ పంటను జనగామ జిల్లాలో తొలిసారిగా పండిచేందుకు లింగాలఘనపురం మండలం జీడికల్ను ఎంచుకొని రైతు మైలారం వెంకన్నను ఎంపిక చేశారు. ప్రభుత్వం ఎకరానికి రూ.5 లక్షలు మంజూరు చేయగా, వెంకన్న తన వాటాగా అందులో 25 (1.25లక్షలు) శాతం నిధులు చెల్లించాడు. ఆర్గానిక్ పద్ధతిలో ఎకరం పొలంలో సాగుకు శ్రీకారం చుట్టాడు. పొలంలో 8 ఫీట్ల ఎత్తు ఉన్న సిమెంటు స్తంభాలు తీసుకొచ్చి 2ఫీట్ల లోతులో పాతాడు. 6 ఫీట్ల ఎత్తు స్తంభాలకు ఒక్కోదాన్ని ఆధారం చేసుకొని నాలుగు మొక్కలు నాటాడు. స్తంభానికి, స్తంభానికి మధ్య 8 ఫీట్ల ఎడం, మొక్కల మధ్య 10 ఫీట్ల నిడివి ఉండేలా చూశాడు.
ఎకరం పొలంలో 504 స్తంభాలు పాతి, 2028 మొక్కలను విజయనగరం నుంచి తెచ్చి నాటాడు. డ్రిప్ ఏర్పాటు చేసి 15 రోజులకోసారి నీటిని అందిస్తున్నాడు. నెలకోసారి పశువులపేడ, ఎర్రలతో తయారైన ఎరువు వేస్తున్నాడు. ఈ పంటకు సోకే ఏకైక లద్ది పురుగును నీంఆయిల్ స్ప్రే చేస్తూ దరిచేరనీయకుండా చేశాడు. పండిన ఫలాలను హైదరాబాద్ తరలించి కిలోకు రూ.300 నుంచి రూ.400కు విక్రయించాడు. గతేడాది ఎకరానికి దాదాపు రూ.3లక్షల నుంచి రూ.4లక్షల దాకా ఆదాయం వచ్చింది. ఒక్కసారి నాటిన మొక్క 25 ఏళ్లపాటు ఫలాలు ఇస్తుంది. ఐదో సంవత్సరం నుంచి ఏటా రూ.5లక్షల నుంచి రూ.6లక్షల దాకాఆదాయం వస్తుంది. సగటున ఏటా రూ.8లక్షలకు పైనే ఆదాయం అందించే ఈ పంటపై రైతులు దృష్టి సారిస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.
రోగాల బెడద లేదు
నేను దాదాపు ఐదేళ్లుగా వివిధ ప్రాంతాలకు వెళ్లి డ్రాగన్ ఫ్రూట్ సాగు విధానం గురించి తెలుసుకున్న. సబ్సిడీ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే ప్రయోగాత్మకంగా జనగామ జిల్లా నుంచి అధికారులు నన్ను ఎంపిక చేశారు. ప్రభుత్వం ఎకరానికి రూ. 5లక్షలు మంజూరు చేసింది. రూ.1.25 లక్షలు వాటాగా నేను భరించా. గతేడాది రూ.4లక్షలదాకా ఆదాయం వచ్చింది.
– మైలారం వెంకన్న, రైతు జీడికల్