పల్లెలు, పట్టణాల నుంచి తరలిన గులాబీ దండు.. ఉప్పెనలా వచ్చిన జనం.. దారులన్నీ జనగామ వైపే.. టీఆర్ఎస్ నేతృత్వంలో జనగామ జిల్లా యశ్వంతాపూర్ సమీపంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వచ్చారు. గులాబీ జెండాలు చేబూని జై తెలంగాణ.. జై కేసీఆర్ అని నినదించారు.
-నమస్తేతెలంగాణ నెట్వర్క్
-బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తెలంగాణ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రప్రభుత్వంపై పోరాడండి.. మీ వెంట మేమున్నాం.. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. శుక్రవారం జనగామ మం డలం యశ్వంతాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని, రాష్ర్టాలకు అధికారాలు కుదించి ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చిందని మండిపడ్డారు. తెలంగాణ రాక ముందు పల్లెల్లో లోవోల్టేజీ సమస్యతో మోటర్లు కాలిపోయేవని, చెరువులు ఎండిపోయి కనిపించేవన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారని, ప్రతి ఎకరానికి నీరిచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేసిన మహాత్ముడని కొనియాడారు. పెద్ద మనుసుతో జనగామ జిల్లాకు మెడికల్ కాలేజ్, పాలకుర్తికి డిగ్రీ కాలేజీ, కొడకండ్లకు టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి, రాయపర్తి మండలాలకు నీరిచ్చే దేవాదుల రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ఆ కాంట్రాక్టర్ తొలగించారని గుర్తు చేశారు. సన్నూరు వేంకటేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి రూ.10కోట్లు మంజూరు చేయాలన్నారు. పాలకుర్తి టూరిజం కారిడార్‌కు నిధులిచ్చి అభివృద్ధి చేస్తున్నందుకు సీఎంకు ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే జనగామ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
-మంత్రి సత్యవతి రాథోడ్
మా తండాలో మా రాజ్యం తెచ్చిన సీ ఎం కేసీఆర్ గిరిజనుల పాలిట దేవుడని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. సమైక్య పాలనలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ గిరిజనులను పట్టించుకోకుండా మోసం చేశాయన్నారు. గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా మార్చిన దేవుడు సీఎం కేసీఆర్‌కు గిరిజనులు రుణపడి ఉంటామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే ఉమ్మడి వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మంత్రులుగా తాము భాగస్వాములవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఉద్యమ నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరాయని చెప్పారు. కొత్త కలెక్టరేట్లతో ప్రజలకు పాలన మరింత చేరువవుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సచివాలయం మాదిరిగా కలెక్టరేట్ ఉందన్నారు. కరువు నేల జనగామను సస్యశ్యామలం చేసిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు సిగ్గు చేటన్న సత్యవతి, కొద్దిసేపు లంబాడా భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు.
జనగామ గడ్డ గతంలో పసిగడుగులు తాగి దాహార్తిని తీర్చుకున్న నేల.. స్వరాష్ట్రంలో గోదావరి జలాలతో పచ్చబడింది.. కరువు నేలన సిరులు పండుతున్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ జనగామ నుంచి సిద్దిపేట వెళ్తున్న క్రమంలో ఇక్కడి ప్రజల నీటి గోస చూసి చలించిపోయారని గుర్తు చేశారు. దేవుడే ఇక్కడుంటే వరాలు ఏమి అడగాలని, అడుగకముందే వరాలిచ్చే దేవుడు కేసీఆర్ అని తెలిపారు. జనగామ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు నీటితిప్పలు లేకుండా చేయాలని అడగడంతో వెంటనే రూ.104 కోట్లు మంజూరు చేశారని ఆయన అన్నారు. మల్లన్నసాగర్ నుంచి ఇక్కడి గ్రామాలకు నీటి విడుదల సులభంగా ఉండడంతో వెంటనే తపాస్‌పల్లికి నీటిని విడుదల చేయాలని కోరారు. తెలంగాణపై కొందరు చిల్లరగాళ్లు చిల్లరమాటలు మాట్లాడితే ఊరుకునేదని లేదని హెచ్చరించారు. జనగామకు మెడికల్ కళాశాల ఇవ్వడం సంతోషమన్నారు.
-ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఎగువ ప్రాంతమైన జనగామ తీవ్ర కరువు కాటకాలను ఎదుర్కొని బీళ్లుగా మారిన భూములు నేడు సీఎం కేసీఆర్ కృషితో సాగులోకి వచ్చి పచ్చదనంతో కళకళలాడుతున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జయశంకర్ సార్, కాళోజీ సిద్ధాంతాలను పుణికి పుచ్చుకుని, వారి స్ఫూర్తితో ఉద్యమించిన కేసీఆర్ వెంటే జనగామ ప్రాంత ప్రజలు ఉన్నారని అన్నారు. పరప్రాంతం వాడు ద్రోహం చేస్తే పొలిమేరలు దాటే దాక తరిమికొట్టాలి.. మనవాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతరేయాలనే సిద్ధాంతంతో ఉద్యమిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా ఆయన వెంటే నడుస్తామన్నారు. ఉద్యమ సమయంలో, 2004లో చేర్యాల, చెన్నూరు, స్టేషన్‌ఘన్‌పూర్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించిన గడ్డ ఇదన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో వ్యవసాయం పండుగలా మారి, లక్షలాది ఎకరాల భూములు సాగులోకి వచ్చాయన్నారు. ఇటీవల ధర్మసాగర్, చిల్పూరు, వేలూరు మండలాల్లోని మరో 15 గ్రామాలకు సాగు, తాగు నీటికి నిధులను మంజూరు చేశారని, ఆ గ్రామాల ప్రజల తరఫున తాను కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ దళిత బంధువుగా మారారని, ఆయన సేవలు దేశానికి ఎంతో అవసరమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య అన్నారు. కేసీఆర్ పిలుపుతో ఎమ్మెల్యే పదవిని త్రుణప్రాయంగా త్యజించి ఉద్యమంలో భాగస్వామినయ్యానని గుర్తు చేశారు. దాని ఫలితమే నేడు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎక్కడా లేనన్ని ప్రాజెక్టులతో కళకళలాడుతున్నదని, ఇదంతా కేసీఆర్ చలువేనన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేశారు.. కానీ, పనులను ప్రారంభించలేదని, దానిపై దృష్టిసారించాలని కోరారు. దళితబంధు పథకాన్ని దేశం మొత్తం అమలయ్యేలా సీఎం కేసీఆర్ పోరాడాలని, మేమంతా ఆయన వెంటే నడుస్తామని పేర్కొన్నారు.