పోచమ్మమైదాన్, ఏప్రిల్ 28: వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక సేవలో భాగంగా యువతకు జిమ్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు.. గ్రేటర్ వరంగల్ కల్యాణ్‌నగర్‌కు చెందిన తాళ్లపల్లి ప్రకాశ్‌గౌడ్ ప్రతాప్‌నగర్ స్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విద్యార్థులకు బోధనతో పాటు ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి పోచమ్మమైదాన్‌లో ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ ద్వారా తర్ఫీదు ఇస్తున్నారు. దాదాపు పది సంవత్సరాల నుంచి ఆసక్తి ఉన్న యూత్‌తో పాటు పూర్వ విద్యార్థులకు శారీరక, మానసిక ఉల్లాసం కోసం జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇందులో బెంచ్ ఫ్రెష్, ల్యాట్స్, బటర్‌ఫ్లై, డంబుల్స్, కార్డియో మిషన్, సైక్లింగ్, లెగ్ ప్రెస్, షోల్డర్ మిషన్ తదితర పరికరాలతో ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఈ జిమ్‌లో పదేళ్ల కాలంలో సుమారు వెయ్యి మంది వరకు తర్ఫీదు పొందారు. ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో యూత్ సభ్యుల సంఖ్య తగ్గినప్పటికీ కరోనా నిబంధనలు పాటిస్తూ కొనసాగిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్న జిమ్ నిర్వాహకులను పలువురు అభినందిస్తున్నారు.