సమాచారమిచ్చిన వారికి బహుమతి
భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు
వాల్పోస్టర్లు అంటించిన పోలీసులు
అటవీగ్రామాల్లో హై అలర్ట్
భూపాలపల్లి టౌన్, ఏప్రిల్ 25 : మావోయిస్టులకు సహకరిస్తే చర్య లు తప్పవని భూపాలపల్లి డీఎస్పీ సంపత్రా వు హెచ్చరించారు. మండలంలోని అటవీగ్రామాల్లో సీఐ వాసుదేవరావు, పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. కమలాపూర్, రాంపూర్, గొల్లబుద్ధారం, దూదేకులపల్లి, నందిగామ, దీక్షకుంట, ఆజంనగర్, నాగారం తదితర గ్రామాల్లో మావోయిస్టుల ఫొటోల తో ముద్రించిన వాల్పోస్టర్లను అంటించారు. ఈ సందర్భంగా గొల్లబుద్దారం, దూదేకులపల్లి గ్రామస్తులతో డీఎస్పీ సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలోని అటవీ, సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టులు సంచరిస్తున్న ట్లు సమాచారం ఉందని, ఏదో ఒక విధ్వంసం సృష్టించడానికి వారు వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో వారి ఫొటోలతో కూడిన వాల్పోస్టర్లు అంటించామని, కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడంతో పాటు బహుమతి అందజేస్తామని తెలిపారు. సీఐ వాసుదేవరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులదే అన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు అభినవ్, నరేశ్, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.