జనగామకు గోదావరి తెచ్చిన సాగు సంబురం..
దేవాదుల నీటితో సస్యశ్యామలం
అంచనాలకు మించి సాగుబడి.. వలస రైతుల ఊరిబాట
కూలీలకు చేతినిండా పనుల భరోసా
జనగామ, జూన్ 25 (నమస్తే తెలంగాణ):ఒకప్పుడు.. నెర్రెలు బారిన భూములు. గుక్కెడు నీటికి తండ్లాడి డొక్కలెండి అల్లాడిన మూగజీవాలు. గంటల తరబడి బోరు నడిచినా గోలెం నిండని దుర్భిక్ష పరిస్థితులు. ఎవుసం ముందుకు సాగక చేతులెత్తేసిన రైతులు. ఉపాధి కరువై పొట్ట చేతపట్టుకొని గూడు వదిలి వెళ్లిన కూలీలు. సాగునీటి సంగతి దేవుడెరుగు.. కనీసం తాగేందుకూ నీళ్లు దొరకని రోజుల్లో చివరికి బియ్యం కడిగిన నీటిని పారబోయకుండా కాలకృత్యాలు తీర్చుకున్న దుర్భర బతుకులు జనగామ ప్రజలవి..
కానీ ఇప్పుడు.. ఎటు చూసినా పచ్చని పొలాలు.. మూగజీవాలు అడుగడుగునా దమ్మారా దాహం తీర్చుకునేలా నీటి వనరులు.. వానకాలం మొదట్లోనే నిండా నీటితో చెరువులు, కుంటలు, బావులు.. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన సాగు భూములు.. మోముల్లో చెరగని చిరునవ్వులతో రైతులు.. చేతినిండా పనులతో కూలీలు.. దశాబ్దాల క్రితం ఊరు విడిచి వెళ్లిన వాళ్లు సంబురంగా సొంతూళ్లకు తిరిగి వస్తున్న దృశ్యాలు.. ఇదంతా అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో దేవాదుల రూపంలో తరలివచ్చిన గోదారమ్మ తెచ్చిన కొత్త జీవన చిత్రం..
గోదారమ్మ పిలిచింది..
జిల్లాలోని బచ్చన్నపేట, నర్మెట, లింగాలగణపురం, రఘునాథపల్లి, దేవరుప్పుల, జనగామ మండలాల్లోని అనేక గ్రామాల ప్రజలు ఉన్న ఊళ్లల్లో ఉపాధి కరువై పొట్టచేత పట్టుకొని బతుకుదెరువు కోసం హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకే కాకుండా దుబాయి, భీవండి, ఆంధ్రా ప్రాంతాలకు వలసవెళ్లారు. దశాబ్దాల తరబడి ఆయా ప్రాంతాల్లో నిర్మాణ రంగాల్లోనో, వ్యవసాయ కూలీలుగానో స్థిరపడిపోయారు. పెండ్లిండ్లకో పేరంటాలకో చుట్టపుచూపుగా వచ్చిపోయేప్పుడు గుడ్లల్లో నీళ్లు గుడ్లల్లనే కుక్కుకొని వెళ్లేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం చేపట్టిన సాగునీటి పథకాలు కాళేశ్వరం, దేవాదులతో ఇప్పుడీ పరిస్థితులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగు కల ఫలిస్తున్న నేపథ్యంలో పల్లెల్లో బతుకుపై ఆశలు చిగురించి ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా తిరిగి తమ స్వస్థలాలకు వస్తున్నారు. ‘నేను హైదరాబాద్ పోయి ఇరవై ఏండ్లయింది. ఇక్కడ బతుకుదెరువు లేక వెళ్లిపోయిన. ఊళ్లోకి నీళ్లొచ్చాయని తెలిసి మూడు నెలల క్రితం వచ్చిన. నాకున్న రెండెకరాల్లో వరినాటేసిన’ అని 67 ఏండ్ల తాడురు రామమల్లయ్య చెప్పాడు. ‘నేను తొమ్మిదేండ్లు డ్రైవర్గా హైదరాబాద్లోనే ఉన్న ఇప్పుడు మా ఊరికి నీళ్లొచ్చినయని తెలిసి ఆర్నేళ్ల క్రితమే వచ్చిన. ఉన్న ఊరులో బతుకు ఎంత గౌరవంగా ఉంటుందో ఇక్కడికొచ్చినంక అర్థమైతాంది’ అని చల్లా రవి కళ్లలో నీళ్లు తీసుకున్నాడు. ఇలా ఎందరో గోదారమ్మ పిలుపునకు తిరిగి ఊళ్లకు చేరుకున్నారు.
అసాధారణ ఆకుపచ్చని మార్పు ..
బచ్చన్నపేట మండలం కొన్నె, లింగంపల్లి వంటి అనేక గ్రామాల్లో పడావుపడ్డ భూములు తిరిగి జలసిరులతో కళకళలాడుతూ ఆ ఊర్ల రూపు రేఖలే మారిపోయాయి. మూడేళ్లుగా ఏటా రెండు పంటలు పండుతున్నాయి. బచ్చన్నపేట మండలంలో 138 చెరువులు, కుంటలున్నా అంతకుముందు ఆరేడు వందల ఎకరాలు సైతం సాగవ్వకపోయేవి. దీంతో అడ్డికి పావుసేరు చొప్పున భూములు అమ్ముకొని వెళ్లిపోయిన సందర్భాలుండేవి. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. కొన్నె గ్రామానికి చెందిన ఓ రైతు మాట్లాడుతూ ‘2005లో మా బాబాయిలు, పెద్దనాన్నలకు చెందిన 54 ఎకరాల భూమిని ఎకరానికి రూ.54వేల చొప్పున అమ్ముకున్నం. ఇప్పుడు ఇంతదూరమున్న మా ఊరిలో భూమి అమ్మేందుకు ఎవరూ ముందుకొస్తలేరు. చిన్న చిన్న కుంటలు, చెరువులు నిండి రెండు పంటలు పండుతున్నయ్. ఇప్పుడు ఎకరానికి రూ.25లక్షల నుంచి రూ.30లక్షలు పలుకుతాంది.’ అంటూ వివరించారు. బచ్చన్నపేట మండలంలో సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయి. మండలంలో కొత్తగా రెండు రైస్ మిల్లులు (ఒకటి రా రైస్ మిల్లు, మరొకటి పారా బాయిల్డ్ రైస్ మిల్లు) ప్రారంభమయ్యాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాకముందు 32 మిల్లులుంటే ఇప్పుడు అదనంగా మరో ఎనిమిది కొత్తగా వెలిశాయి. పడావుపడి, నీరులేక తుమ్మలు మొలిచిన చెరువులకు మిషన్ కాకతీయ పునర్జీవం పోస్తే గోదారమ్మ జలపుష్ప మాల వేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని చెరువుల్లో ఉచిత చేపపిల్లలను వేయడం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న 453 చెరువుల ద్వారా మూడేళ్లుగా దాదాపు రూ.85కోట్లకు పైగా ఆదాయంతో 150 మత్స్యకార సంఘాలు లబ్ధిపొందాయి. తాటివనాలు తిరిగి జీవకళను సంతరించుకొని గౌడన్నలకు పుష్కలంగా కల్లు పారుతున్నది. రియల్భూమ్ రోజురోజుకూ విస్తరిస్తున్నది. బచ్చన్నపేట మండలంలో ప్రతి ఏప్రిల్-మేలో విపరీతంగా వడగండ్ల వానలు పడి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టేవి. సాలాపూర్, లింగంపల్లి, మన్సాన్పల్లి, కొన్నే, నాగిరెడ్డిపల్లి, పడమటికేశవాపూర్, కొట్కూర్, ఆలిపూర్, బన్నారం వంటి అనేక గ్రామాలు వడగండ్లతో అతలాకుతలమయ్యేవి. మూడు నాలుగేళ్లుగా ప్రత్యేకించి గతేడాది నుంచి వాతావరణంలో వచ్చిన మార్పులతో (గ్రీనరీ నేపథ్యంగా) వడగండ్లవానలు చాలా వరకు తగ్గిపోయాయి.
కేసీఆర్ పుణ్యమా అని చెర్లు నిండినయ్. డ్యాములల్ల నీళ్లు వస్తున్నయ్ కాబట్టి మొఖాలు తెరుపైనయ్.. లేకపోతే తిప్పలే ఉంటుండె. ఒకప్పుడు ఉపాధి పనులే దిక్కు. ఆళ్లీళ్లు నచ్చినోళ్లను పనులకు పిలుచుకునేది. కానీ నాలుగేండ్ల నుంచి కాలం ఎట్లున్నా చెర్లునిండి చేతినిండా పనుంటాంది. ఊర్లల్ల పనులకైతే సావులేదు.’ అని నర్మెట మండలం వెల్దండికి చెందిన శ్రీపతి సత్తెవ్వ, దొండకాయల లక్ష్మి, పంతంగి లచ్చవ్వ, శివంగి కొమురవ్వ, పంతంగి బాలవ్వ తమ బతుకుచిత్రాన్ని ఆవిష్కరించారు.