స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 21: నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రతిపాధనలు పంపించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థా యి ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా దళిత సాధికారతే లక్ష్యంగా నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి, చివరి గ్రామంలో పల్లెనిద్ర చేశానని, అక్కడ ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చానని పేర్కొన్నారు. ఆ హామీలు నెరవేర్చడానికి సీడీఎఫ్ నిధులు మంజూరు చేస్తామన్నారు. ఇందుకోసం ఏఈలు, వర్క్ ఎస్టిమేట్లను త్వరగా ఇస్తే కలెక్టర్‌కు పంపిస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు సీసీరోడ్ల కోసం రూ. 150 కోట్ల నిధులు కోరానని, ఈ విషయంపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలువగా సానుకూలంగా స్పందించారిని పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారు లు, జనగామ ఈఈ రఘువీరారెడ్డి, వరంగల్ ఈఈ శంకరయ్య, డీఈలు, ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన వరంగల్ మార్కెట్ వైస్ చైర్మన్ కరంచంద్
వరంగల్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్‌గా ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి గ్రామానికి చెందిన కాలేరు కరంచంద్ నియమితులయ్యారు. ఈ నెల 24న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ధర్మసాగర్ వైస్ ఎంపీపీగా పనిచేసిన కరంచంద్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశాడు. శనివారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజయ్యను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి రావడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వేలేర్ జడ్పీటీసీ చాడా సరితారెడ్డి, ధర్మసాగర్ జడ్పీటీసీ పిట్టల శ్రీలత, స్టేషన్‌ఘన్‌పూర్ జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ మండల కన్వీనర్ మాచర్ల గణేశ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు జుబేదా లాల్ మహ్మద్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కర్ర సోమిరెడ్డి, మల్లక్‌పల్లి సర్పంచ్ మునిగల రాజు, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మాజీ ఉపసర్పంచ్ రవీందర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు మంద ఆరోగ్యం పాల్గొన్నారు.
విద్యార్థిని నిక్షితకు సన్మానం
బాసర ట్రిబుల్ ఐటీలో సీటు సాధించిన పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మాచర్ల పుల్లయ్య, స్వరూప దంపతుల కూతురు నిక్షితను ఎమ్మెల్యే రాజయ్య క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. పదో తరగతిలో మండల టాపర్‌గా, జిల్లా సెకండ్ టాపర్‌గా నిలిచిన నిక్షితను స్టేషన్ ఘన్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సన్మానించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులు, పుట్టిన ఊరుకు మంచిపేరు తీసుకు రావాలని అన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దుస్సా నరేశ్, కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి, కోశాధికారి గోలి ప్రశాంత్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తాటికొండ సురేశ్, కర్ర సోమిరెడ్డి, ఎంపీటీసీ జాన్సీ, మడపల్లి సునీత, దూసరి గణపతి పాల్గొన్నారు.