పథకాలు క్షేత్రస్థాయిలోఅమలు చేయాలి
అర్హులందరికీ ఫలాలు అందాలి
వరంగల్ ఎంపీ దయాకర్,జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్
ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య
జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ
(దిశ) సమావేశం
జనగామ, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సర్కారుకు రెండు కళ్లలాంటి అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను కేత్రస్థాయిలో అర్హులందరికీ అందేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కృషి చేయాలని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం గురువారం జరిగింది. కలెక్టర్ కే నిఖిల, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం లో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవన భద్రత కల్పించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ భగీరథ ద్వారా నిరంతరం తాగునీటి సరఫరా, రహదారుల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి పల్లె, పట్టణ ప్రగతితో పాటు పచ్చదనం, పరిశుభ్రత ధ్యేయంగా ముందుకు సాగుతున్న ట్లు వివరించారు. జనగామ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఉపాధి హామీలో భాగంగా జిల్లాలోని 12 మండలాల పరిధిలో ఉన్న 281 గ్రామాల్లో లక్షా 21వేల 462 కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. ఈజీఎస్‌లో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, రైతు వేదికలు, రైతు కల్లాలు, నర్సరీలు, మేకలు, గొర్రెల పాకలు, కోళ్ల పాకలు, ఆవు, గేదెల పాకల నిర్మాణం జరుగుతున్నాయని చెప్పారు. ఇందుకోసం రూ.49.62 కోట్లు ఖర్చు చేశామని, హరితహారంలో ఈ ఏడాది 33 లక్షల 58వేల మొక్కలు నాటే లక్ష్యానికి గానూ ఇప్పటి వరకు 24 లక్షల 46వేల 342 మొక్కలు నాటినట్లు వివరించారు.
పీఎం సడక్ యోజన రూ. 96.13 కోట్ల అంచనాలతో మొదటి విడుత 7, రెండో విడుతలో 5 రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరవగా పనులు ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో 1,199 ప్రవవాలు జరిగితే 1,059మందికి కేసీఆర్ కిట్స్ పంపిణీ చేశామని, గతంలో ప్రసవాలు 30 శాతం ఉంటే ప్రస్తుతం 80 శాతానికి పెరిగాయన్నారు. కొవిడ్ మూడో దశ వ్యాప్తికి అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కొవిడ్ మొద టి డోసు 99 వేల 604 మందికి, రెండో డోసు 42వేల 946 మందికి ఇచ్చారని, డిసెంబర్‌లోగా ప్రతి ఒక్కరికి టీకా అందించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లాలో లక్షా 62వేల 870 ఆహార భద్రత కార్డులు ఉంటే జూన్‌లో 15కిలోలు, జూలైలో 5 కిలోలు, ఆగస్టులో 15 కిలోల చొప్పున పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో భాగంగా బియ్యం పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ, తాగునీరు, టాయిలెట్స్ సదుపాయా ల కల్పనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని 281 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను అందజేసి తడి, పొడి చెత్తను వేరుచేసి డంపింగ్‌యార్డుకు తరలించేలా చర్యలు చేపట్టాన్నారు. రూ.24.15కోట్లతో జిల్లాలోని 483 ఆవాసాల్లో పల్లెప్రకృతి వనాలు చేపట్టామ ని, రూ.35.12కోట్లతో అన్ని పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేశామని వివరించారు. కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ ఆసరా పింఛన్‌కు అర్హత వయసు 57 ఏళ్లకు కుదించిన నేపథ్యంలో అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఏ.భాస్కర్‌రావు, అబ్దుల్ హమీద్, డీఆర్డీవో రాంరెడ్డి, దిశ కమిటీ సభ్యులు రావెల రవి, బొల్లం శారద, గుడికందుల కృష్ణ, మాలోత్ రమేశ్‌నాయక్, తాటికొండ సురేశ్, యాకంతరావు, గాదెపాక సువర్ణ, ఏదునూరి రమాదేవి, ఉడుగుల భాగ్యమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.