పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక
ముందుగా అడవిబిడ్డల ఆరోగ్యానికి సర్కారు భరోసా
మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమీక్ష
పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్
మరో వారంలో మార్గదర్శకాలు
ఇంటికే వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాల సేకరణ
బీపీ, షుగర్, వివిధ రక్త పరీక్షలు చేసి ఆన్లైన్లో నమోదు
వరంగల్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా చేపట్టిన ‘హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు’లో రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ములుగు జిల్లాను పైలట్‌గా ఎంపిక చేసి ముందుగా అడవిబిడ్డలకు భరోసా కల్పించింది. ప్రాజెక్టు అమలుపై గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఉమ్మడి జిల్లా మంతుల్రు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి బీపీ, షుగర్, వివిధ రక్త పరీక్షలు చేసి ఆ వివరాలను నమోదు చేసే విషయంలో మరో వారంలో మార్గదర్శకాలు రానుండగా, ఇక పౌరుల ఆరోగ్య సమస్యలను వెంటవెంటనే తీర్చే అవకాశం లభించనుంది.
ప్రజలకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రతి ఒక్కరికీ వేగంగా వైద్య సేవలు కల్పించే లక్ష్యంతో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు చేపట్టింది. రాష్ట్రంలో పైలట్ కింద రాజన్న సిరిసిల్ల జిల్లా, ములుగు జిల్లాను ఎంపిక చేసింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ గురువారం హైదరాబాద్‌లో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. టెక్నాలజీ సహకారంతో ప్రజాసమస్యలను పరిషరించేందుకు, అత్యంత సులభంగా ప్రభుత్వ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కనీస సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే ఆ శాఖ పరిధిలో చేపట్టే భవిష్యత్ ప్రణాళికలకు సరైన ప్రాతిపదిక అవుతుందని చెప్పారు. పౌరుల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుతో లభించే సమాచార విశ్లేషణ చేయడం వల్ల వివిధ జిల్లాల్లో ప్రత్యేకంగా ఉన్న వ్యాధులు, సీజనల్ వ్యాధుల పరిస్థితిని గుర్తించవచ్చని, దీంతో ఆయా సమస్యల నివారణ, చికిత్స కార్యక్రమాలు చేపట్టేందుకు వీలు కలుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల సమయాల్లో అత్యవసర చికిత్స అందించేందుకు ప్రజల ప్రాథమిక సమాచారం సహాయ పడుతుందని తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లాను ఎంపిక చేయడం వల్ల అక్కడి ప్రజలకు అనేక ఉపయోగాలు ఉంటాయని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి అన్నారు. గిరిజన జనాభా అధికంగా ఉండే ఈ జిల్లాలో ప్రజలకు అత్యవసరమైన ఆరోగ్య సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు.
హెల్త్ ప్రొఫైల్ కీలక పాత్ర..
వైద్య ఆరోగ్య రంగంలో వ్యాధుల పరిస్థితి, వాటి నివారణ, ఇతర కార్యక్రమాల తయారీలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషించనుంది. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ వైద్యం అందించేందుకు ఈ ప్రాజెక్టు సమాచారం దోహద పడుతుంది. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు అమలు కోసం మరో వారంలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. హెల్త్ ప్రొఫైల్ రికార్డును ఇప్పటికే పూర్తిచేసిన ఈస్టోనియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేసి ఆ మేరకు అమలు చేయనున్నారు. ముందుగా ములుగు జిల్లా వైద్య శాఖ సిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను ప్రజల ఇంటివద్దే సేకరిస్తారు. బీపీ, షుగర్ వంటి వివిధ రక్త పరీక్షలు చేసి ఆ వివరాలను నమోదు చేస్తారు. అదనపు పరీక్షలు అసరమైన వారిని సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లకు పంపించి అక్కడ నిర్వహిస్తారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తారు. దీని కోసం ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని, పరికరాలను అందుబాటులో ఉంచుతారు.