ఆదిమానవులు సంచరించిన నేల.
తవ్వినకొద్దీ చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి
ప్రాచీన శిలాయుగం నుంచి వెలకట్టలేని సంపద
చారిత్రక ప్రాంతంగా కొన్నెగుట్ట, కొడవటూరు
బండనాగారంలో చాళక్యుల నాటి ఆలయం
పర్యాటక ప్రదేశాలుగా గుర్తించాలని స్థానికుల విజ్ఞప్తి
బచ్చన్నపేట, అక్టోబర్ 16 : పురాతన కాలం నుంచి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా మండలంలోని పలు గ్రామాల్లో ఆనావాళ్లు వెలుగు చూస్తున్నాయి. పాచీన శిలాయుగం నుంచి నేటి వరకు ఆరిపోని దివిటిలా తవ్విన కొద్ది నాటి ఆదిమానవులు ఉపయోగించిన వస్తువులు కనిపిస్తున్నాయి. వారు స్థిర నివాసం ఏర్పరచుకున్న తొలినాళ్లలో గుంపులు, గుంపులుగా సంచరించారు. వారు సంచరించిన నేలలోనే నేడు గ్రామాలు పురుడుపోసుకున్నట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. చారిత్రక విశేషం లేని ఊరు మండలంలో లేదంటే అతిశయోక్తి లేదు. కొన్నె గుట్ట నుంచి ఇటు కొడవటూరు సిద్దులగుట్ట వరకు ఎన్నో యుగాల నాటి మనుగడకు నిలువెత్తు ఆధారాలు లభిస్తున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రాచీనశిలా యుగం నుంచి నేటి వరకు సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆలయాలు, కట్టడాలు, కోటలు, బురుజులు, విగ్రహాలు, గుట్టలు ఎన్నో నేటి తరానికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.. తెలంగాణ ప్రభు త్వం సైతం నాటి కట్టడాలను పునరుద్ధరించేందుకు చర్య లు తీసుకుంటున్న క్రమంలో మండలంలోని చారిత్రక ప్ర దేశాలను పరిశీలించాలని పలువురు సూచిస్తున్నారు.
ఊరుకో చరిత్ర..
బచ్చన్నపేట మండలంలోని ప్రతి ఊరికో చరిత్ర ఉందని చెప్పొచ్చు. రైతు పొలాన్ని అచ్చుగడితే బచ్చన్నపేట చరిత్ర ను అచ్చు గట్టింది. తెలంగాణ చరిత్రను మరింత వికసింపచేసే కొన్నె, కొడవటూరు గుట్టలు, పడమటికేశ్వాపూర్ శి వారు జయాల ఈ మండలంలోనే ఉన్నాయి. ప్రాచీన శిలాయుగం నుంచి నేటి దాక విచ్చిన్నంగా సాగిన చరిత్రకు బ చ్చన్నపేట దొసిట పట్టిందని చెప్పొచ్చు అందులో వెలకట్టలేని చరిత్రాక సంపద ఉందని నాటి పెద్దలు చెబుతుంటారు.
నలుగురు అన్నదమ్ముల పేరిట నాలుగు గ్రామాలు..
బుచ్చిరెడ్డి, పోచారెడ్డి, చిన్నరాంరెడ్డి, పెద్దరాంరెడ్డి అనే నలుగురు అన్నదమ్ముల పేరిట నాలుగు గ్రామాలు వెలిశాయని చరిత్ర చెబుతుంది. అందులో బుచ్చిరెడ్డి పేరిట బచ్చన్నపేట, పోచారెడ్డి పేరిట పోచన్నపేట, పెద్ద రాంరెడ్డి పేర పెద్దరామన్‌చర్ల, చిన్నరాంరెడ్డి పేర చిన్నరామన్చర్ల ఏర్పడ్డాయని పూర్వికులు చెబుతుంటారు. ప్రతి గ్రామంలో గడీలున్నాయి. బచ్చన్నపేట గ్రామం నడిబొడ్డున పెద్ద గడి ఉంది.. దాని పక్కనే ప్రాచీన జైన దేవాలయం ధ్వంసం కా బడింది. అదే చోట చెన్నకేశవాలయం ఏర్పడింది. ఆల యం ముందు జైనదేవాలయ ధ్వజ స్థంభం ఉంది. శివాలయానికి రెండు వైపులా శిల్పాలున్నాయి. చాళక్యుల నాటి శిల్పకళతో శోధించే రెండు శిల్పాలున్నాయి. ఏనుగుపై ఓ స్త్రీమూర్తి మాదిరిగా ఉన్నట్లు ఆనవాళ్లతో శిల్పాలున్నాయి. కొడవటూరుకు వెల్లేదారిలో 477 మీటర్ల ఎత్తులో ఉన్న పాటిగడ్డ పోచమ్మబండ, మైసమ్మమర్రి, హనుమాన్ దేవాలయం ఉన్నాయి. బీరప్పగుడిలో నవీనశిలాయుగం నాటి రాతి పనిముట్లు ఉన్నాయి. బచ్చన్నపేట ఊరిలోకి రావాలంటే రెండు ద్వారాలు ఉండేవి. ప్రతి ఊరిలో రాకాసిగూళ్లు దర్శనమిస్తాయి. లింగంపల్లి, గండికుంట, జయాల, ఆలింపూర్, ఇటిక్యాలపల్లి, రామచంద్రాపూర్, దబ్బగుంటపల్లి , ఎద్దుగూడెం, గంగాపూర్, పడమటికేశ్వాపూర్, బండనాగారం, పోచన్నపేట, నాగిరెడ్డిపల్లి , చిన్నరామన్చర్ల నక్కవానిగూడెం, సదాశివపేట గ్రామాల్లో జైనుల కాలంలో నిర్మించిన దేవాలయాలు, ఆదిమానవులు సంచరించిన ఆనవాళ్లున్నాయి. బండనాగారంలో పూర్వం జైన ఆయల ఆనవాళ్లు కూలిపోతున్న ద్వజస్థంబాలు, బండపై నవీనశిలా యుగం, రాతి గొడ్డళ్లు పదును పెట్టుకోగా ఏర్పడ గుర్తులు నాటి చరిత్రను గుర్తు చేస్తున్నాయి. అదే విధంగా కాకతీయుల కాలం నాడు నిర్మించిన దేవాలయాలు దర్శనమిస్తాయి.
కొన్నె గుట్టకు ప్రత్యేక గుర్తింపు..
చరిత్రలో అన్ని దశలు కొన్నె గ్రామాన్ని తాకుతూ ప్రవహించాయి. ప్రాచీన శిలాయుగం నుంచి మౌర్య, మగధ, శాతవాహన, చాళుక్య, కాకతీయుల కాలం నుంచి నేటి వరకు కొన్నె ఉరకలెత్తుతుంది. ఇటిక్యాలపల్లి , రామచంద్రాపూర్ గ్రామాల నుంచి ఎదురుగా చూస్తే ఏనుగు ఆకారంలో కన్పించే గుట్టను గజగిరి గుట్టగా పిలుస్తుంటారు. గుట్టకు నాలుగువైపులా వెలకట్టలేని సంపద ఉంది. ప్రాచీన రాజవంశీయులకు చెందిన జాస్టర్, ఐవరీ, రాక్క్రిస్టల్, కార్నేలియన్, క్రిస్టల్ రకాలకు చెందిన రాతి పూసలు, షెల్, బ్యాంగిల్స్(గాజు) లభించడాన్ని బట్టి ఇక్కడి స్త్రీలు సౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కన్పించినట్లు తెలుస్తుంది. పాత్రలు లభించడంతో కుండల పరిశ్రమలు విశేషంగా నెలకొల్పుకున్నట్లు చరిత్ర చెబుతుంది. బౌద్ద మతస్థులు ధర్మచక్ర ముద్రకు సంబందించిన ఆనవాళ్లు లభించాయి. నందిశాసనాల చరిత్రకు శాస్త్రీయతకు చరిత్ర రచనలో కీలకమైన ఆధారాలు లభించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. బైరవునిగుడి కాకతీయుల కాలంలో ఎంతో విశిష్ట పూజలు అందుకుంది. ఉపాధిహామీ పధకంలో ప్రధాన రహదారిని తవ్వగా మృన్మయ పాత్రలకున్న వివిధ రకాల మూతల పైబాగపు బొడిపెలు బయటపడ్డాయి. శావాహనుల కంటే ముందు నుంచే కొన్నెకు చరిత్ర ఉంది. ప్రాచీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు, మధ్యశిలాయుగం నాటి సూక్ష్మరాతి పనిముట్లు, మౌర్యకాలం నాటి పనిముట్లు, మగధకాలం నాటి మట్టి పాత్రను స్వయంగా పరిశోధకులు సేకరించిన సంఘటనలు ఉన్నాయి. కనకాంబరం పూల రంగుతో మెరిసే నునుపైన పాత్రను మగధ రాజవంశం నాటివని మాజీ ఆర్కియాలజీ, మ్యూజియం డైరెక్టర్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కే, పీ రావ్ ధ్రువీకరించారు. కొన్నె గుట్టపై బౌద్ద స్థూప జాడలున్నాయి. గుట్ట పడమటి మార్గం గుండా వెల్లితే ఒక గుహాలయం ఉంది. ప్రస్తుతం దీనిని రంగనాయకుల గుడిగా పిలుస్తున్నారు.
సోలామైల్కు ఓ ప్రత్యేకత..
జనగామ జిల్లా కేంద్రం నుంచి పదహారు మైళ్లు(సోలా, పదహారు కిలోమీటరు) దూరంలో ఉన్న ఏనేకు సోలామైల్ అనే పేరు వచ్చింది. ఆ గ్రామం కట్కూర్ గ్రామ పరిధిలో ఉండేది. ప్రస్థుతం తెలంగాణ ప్రభుత్వం చిన్న శివారు పల్లెలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో సోలామైల్ ( వీఎస్ఆర్.నగర్ ) గ్రామ పంచాయతీగా ఏర్పాటు అయింది. గోదావరి ,క్రిష్ణా నదులు పరివాహాక ప్రాంతం విభజించే ఏనే ఇది. ఏనేలపై రాళ్లన్నీ సంగీతమే పంచుతాయి. కట్కూర్ పాఠశాల వెనుక ఏనేపై ఆది మానవులు గీసిన ద్వివలయ చిత్రాలు ఉన్నాయి. ఆ గ్రామంకు వెల్లే దారిలో నేటికి రాకాసిగూడు ఉంది. రాచఠీవితో ఉట్టిపడే వీరగోలలున్నాయి. ఆవి కట్కూర్ చెరువుపై నేటికి ఉన్నాయి. ఆ శిల్పాలు నేటికి కంటికి వింపుగా కన్పిస్తున్నాయి. మండలంలోని ఆయా గ్రామాల నాటి చరిత్రను నేటి తెలంగాణ రాష్ట్రంలో కాపాడేందుకు చర్యలు తీసుకునేలా చరిత్రను వెలికితీస్తున్నామని పరిశోధకులు రెడ్డి రత్నాకర్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో వెల్లడించారు.