పుట్టల్లో పాలుపోసి మొక్కులు చెల్లించిన మహిళలు
జిల్లాలోని నాగదేవత ఆలయాల్లో భక్తుల సందడి
జనగామ చౌరస్తా/జనగామరూరల్/ బచ్చన్నపేట/ స్టేషన్‌ఘన్‌పూర్/పాలకుర్తి, ఆగస్టు 13 : శ్రావణ శుక్రవారం సందర్భంగా నాగుల పంచమి రావడంతో మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సం తోషిమాత ఆలయం, పోచమ్మ గుడి, గీతాశ్రమం వద్ద నాగదేవతకు అభిషేకం చేశారు. నాగేంద్రుడు కొలువైన పుట్టల్లో పాలు పోయడానికి మహిళలు బారులు తీరారు. కోరిన కోర్కెలు తీర్చాలని మొక్కులు చెల్లించారు. జనగామ మండలం పెంబర్తి ఆలయం, శ్రీసోమేశ్వరాలయం, ఓబుల్ కేశ్వాపూర్లోని శ్రీవెంకటేశ్వర ఆలయం, గానుగుపహాడ్లోని శ్రీరాజరాజేశ్వర ఆలయం, చీటకోడూరులోని శ్రీరామలింగేశ్వర ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. గురుపౌర్ణమి కావడంతో పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లించారు. ఇదిలా ఉండగా బచ్చన్నపేట మం డల కేంద్రంతో పాటు అయా గ్రామాల్లో శుక్రవారం ప్రజ లు నాగులపంచమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు నూతన వస్ర్తాలు ధరించి పిల్లా పాపలతో కలిసి పుట్టల వద్దకెళ్లి నాగదేవతకు పాలు పోసి కోడిగుడ్లు సమర్పించారు. ఇంటిల్లిపాదిని చల్లంగ చూడు తల్లీ అని వేడుకున్నారు. బచ్చన్నపేట, కొన్నె, నాగిరెడ్డిపల్లి, పోచన్నపేట, కట్కూర్ తదితర గ్రామాల్లోనూ నాగులపంచమిని జరుపుకున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని పలు శివాలయాల్లో నాగులపంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచే ఆలయాల్లో బారులు తీరారు. పుట్టల్లో పాలుపోసి అటుకులు, చక్కర, పుట్నాలు, బెల్లంతో నైవైద్యం సమర్పించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లోని స్వయంభు రామలింగేశ్వర స్వామి ఆలయంలో రామలింగయ్య శర్మ, శ్రీనివాస్ శర్మ, ప్రవీణ్ శర్మ, శివునిపల్లిలోని శివాలయంలో మోహన్ శర్మ పూజలు నిర్వహించారు. పాలకుర్తి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో నాగపంచమి వేడుకలను ఘనంగా నిర్వ హించారు.