త్వరలో ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రదానం
ధర్మసాగర్, ఆగస్టు13 : వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ గ్రామానికి చెందిన కొట్టె రాజు శ్రమశక్తి అవార్డుకు ఎంపికయ్యాడు. త్వరలో ప్రధాని మోదీ చేతులమీదుగా అందుకోనున్నాడు. గురువారం కేంద్రప్రభుత్వం 2018 సంవత్సరానికి ప్రధానమంత్రి శ్రమశక్తి అవార్డులను ప్రకటించింది. డిపార్ట్మెంటల్ అండర్ టేకింగ్స్, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్లో పనిచేస్తున్న కార్మికుల పనితీరు, వినూత్న సామర్థ్యం, ఉత్పాదకరంగంలో సహకారం, అసాధారణ ధైర్యానికి గుర్తింపుగా కేంద్రం ప్రధానమంత్రి శ్రమ్ అవార్డులను అందజేస్తుంది. వీటిని శ్రమ్భూషణ్, శ్రమ్వీర్, శ్రమ్శ్రీ మూడు కేటగిరీల్లో ఇస్తారు. ఈ సంవత్సరానికి ప్రకటించిన మొత్తం శ్రమ్ అవార్డుల సంఖ్య 33 కాగా, 69 మంది కార్మికులు అందుకోనున్నారు. శ్రమ్శ్రీ అవార్డులకు తెలంగాణ నుంచి కేవలం ఐదుగురు మాత్రమే ఎంపికకాగా, వారిలో బీహెచ్ఈఎల్ సంస్థ నుంచి ముగ్గురికి చోటుదక్కింది. వారిలో ధర్మసాగర్ గ్రామానికి చెందిన కొట్టె రాజు ఉన్నాడు. హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో పనిచేస్తున్న రాజు 2003 నుంచి 2005 వరకు వరంగల్ ప్రభుత్వ ఐటీఐలో శిక్షణ పొందాడు. 2007లో బీహెచ్ఈఎల్లో అప్రెంటిస్షిప్ పూర్తి చేశాడు. 2008లో అదే సంస్థలో ఉద్యోగం లభించింది. రాజుకు జాతీయస్థాయిలో అవార్డు రావడంతో తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.