చేనేత అభివృద్ధికి యువత ముందుకు రావాలి
పట్టుచీరెల తయారీతో ఆర్థికాభివృద్ధి
ఫ్యాషన్ షోలో వస్ర్తాల ప్రదర్శన
చేనేత జౌళిశాఖ కమిషనర్ శైలజ రామయ్యార్
కమలాపూర్, నవంబర్ 11 : మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్ర్తాలనే తయారు చేయాలని చేనేత జౌళిశాఖ కమిషనర్ శైలజ రామయ్యార్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ చేనేత సహకార ఉత్పత్తి సంఘంలో హిమ్రూ చీరల తయారీపై పది మంది మహిళలతో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శైలజ రామయ్యార్ మాట్లాడుతూ.. మార్కెట్లో చీరలకు డిమాండ్ ఉన్నందున పితాంబరం, ఆర్మూర్, హిమ్రూ చీరలను తయారు చేయడం వల్ల ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. మార్కెట్లో పీతాంబరం, ఆర్మూర్, హిమ్రూ చీరలను ఫ్యాషన్ షోలో ప్రదర్శించినట్లు చెప్పారు. చీరలకు డిమాండ్ ఉండడంతో ప్రభుత్వ ప్రోత్సాహంతో హిమ్రూ చీరల తయారీ శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కమలాపూర్‌లో హిమ్రూ చీరల తయారీలో పదిమంది కార్మికులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. హిమ్రూ చీరల తయా రు చేయడం వల్ల కార్మికులకు ఆర్థికంగా ఎదగడంతో పాటు మార్కెట్లో అమ్ము డు పోయేందుకు అవకాశం ఉందన్నారు. అంతరించి పోతున్న చేనేత రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, కార్పెట్లకు మార్కెట్ లేకున్నా ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులను ఆదుకుందన్నారు. 5లక్షల కార్పెట్లు ప్రభుత్వం వద్ద స్టాక్ ఉన్నట్లు చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ విభజనతో కార్పెట్లు రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆంధ్ర వాళ్లు కొనడం లేదన్నారు. వస్తు మార్పిడితో అమ్ముకునే అవకాశం ఉందని, పాత వస్ర్తాలు తయారు చేయడం వల్ల డిమాండ్, సప్లయి పడిపోయిందన్నారు. గుంత మగ్గాల నుంచి ఫ్రేం మగ్గాలు ఇచ్చామన్నారు.
అందుకే ప్రభుత్వం డిమాండ్ ఉన్న వస్ర్తాలను తయారు చేసేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరిపడా నిధులు తీసుకువచ్చి శిక్షణ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. గద్వాల, పోచంపల్లి, సిద్దిపేటలో చీరల తయారీ వల్ల ఎలాంటి సమస్యలేదన్నారు. వరంగల్‌లోనే సమస్య ఉందని అందుకే చీరల తయారీపై శిక్షణ ఇచ్చి ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న డిజైన్లతో చీరలను తయారు చేయడం వల్ల మహిళలు కొనేందుకు ఇష్టపడుతారని తెలిపారు. శుభకార్యాలకు కొత్త చీరల డిజైన్లు మహిళలు అడుగుతున్నట్లు చెప్పారు. శిక్షణతో నూతన డిజైన్ల చీరల తయారు చేయడం వల్ల మార్కెట్ సప్లయ్ పెరుగుతుందన్నారు. చేనేత రంగంలో రాణించేందుకు యువకులు, మహిళలు ముందుకు రావాలని, విలువ గల బట్టలను తయారు చేయడం వల్ల మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందన్నారు. వరంగల్‌లో 122మంది కార్మికులకు శిక్షణ ఇచ్చామన్నారు. చేనేత రంగ మార్పునకు యువత ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్‌రావు, వీవర్స్ సర్వీస్ సెంటర్ విజయవాడ ఏడీ హిమజ్‌కుమార్, హైదరాబాద్ ఏడీ గోఖల్, వరంగల్ టెస్కో డీఎంవో శ్రీనివాసరావు, ఏడీవో రవీందర్, కమలాపూర్ చేనేత సంఘం మేనేజర్ దామోదర్, కార్మికులు పాల్గొన్నారు.