పాలకుర్తిని టూరిజం హబ్‌గా తీర్చిద్దాలి
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
బమ్మెరలో పోతర స్మారక మందిరం పనుల పరిశీలన
పాలకుర్తి రూరల్, అక్టోబర్ 9 : బమ్మెర పాలకుర్తి వల్మిడి పర్యాటక పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్లకు కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. శనివారం మండలంలోని బమ్మెర పోతన స్మృతి వనం పనులతో పాటు అక్షరాభ్యాసం హాల్, ఫుడ్ కోర్టు, అంఫి థియేటర్, టాయిలెట్స్ బ్లాక్‌లను పరిశీలించారు. ఆనంతరం అధికారులు ప్రజా ప్రతినిధులతో పర్యాటక పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతి పాదనల మేరకు సీఎం కేసీఆర్ పాలకుర్తిని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడం కోసం నిధులు మంజూరు చేశారని చెప్పారు. పాలకుర్తి సోమనాథ కల్యాణ మండపానికి రూ.10 కోట్లు, బమ్మెర స్మృతి వనానికి రూ.7.50 కోట్లు, వల్మిడి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. బమ్మెర పర్యాటక పనులు చురుగ్గా సాగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. పాలకుర్తి సోమనాథుడి కల్యాణ మండప పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. వల్మిడి ఆలయ పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. పర్యాటక పనుల్లో వేగం పెంచాలన్నారు. ఆనంతరం బమ్మెర సబ్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్‌ను వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ ఇవ్వాలని వైద్యాధికారి తాల్క ప్రియాంకను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోందన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ అబ్దుల్ హామీద్, జిల్లా వైద్యాధికారి ఏ మహేందర్, ఇన్టాక్ సంస్థ చైర్మన్ ఫ్రొఫెసర్ పాండు రంగారావు, ఆర్డీవో కృష్ణవేణి, రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ అల్లమనేని నాగేందర్రావు, డీఈ జీవన్‌కుమార్, తహసీల్దార్ ఎన్ విజయభాస్కర్, సర్పంచ్ జలగం నాగభూషణం, వైఎస్ ఎంపీపీ దార శారథ శంకరయ్య, ఆర్ఐ కొండమల్ల రవి ఉన్నారు.