స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 9 : జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. శనివారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లాలోని వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో ఏ ఒక్కరూ కూడా వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండకూడదన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునేలా వారిని చైతన్య పరిచాలని, వీలైనంత త్వరలో జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రి పరిధిలో జనాభా ఎంత, వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు ఎంతమంది, మొదటి డోసు ఎంత మంది వేయించుకున్నారు, రెండు డోసులు ఎంతమంది వేయించుకున్నారు, ఇంకా ఎంత మంది వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు ఉన్నారు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని పరిశీలించి, ప్రతి రోజు ఓపి ఎంత మంది వస్తున్నారు, నెలకు ఎన్ని కాన్పులు అవుతున్నాయి, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందని వైద్యులను అడిగి తెలుసుకుని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి..
అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు మెనూ ప్రకారం.. పౌష్టికాహారం అందిస్తూ వారు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. శనివారం డివిజన్ కేంద్రంలోని ఎస్సీ బస్త్తీ సబ్ సెంటర్‌తో పాటు, నాల్గవ అంగన్వాడీ సెంటర్‌ను పరిశీలించారు. సెంటర్లో 71 మంది పిల్లలు ఉండగా, పోషణ లోపంతో బాలుడు ఉండగా వారి తల్లిదండ్రులను పిలిపించి అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారం అందిస్తున్నారా? ఎందుకు బరువు తక్కువ ఉన్నాడంటూ అడిగి తెలుసుకున్నారు. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు 4, కొద్ది తక్కువ బరవు కల బాలుడు ఒక్కరు ఉండగా, వారు కూడా బరువు పెరిగేలా పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని వారికి సూచించారు. సబ్ సంటర్ పరిధిలో మొదటి డోసు వ్యాక్సిన్‌తో పాటు రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని ఏఎన్ఎంలకు, అంగన్వాడీ టీచర్లకు, ఆశ వర్కర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎం హెచ్‌వో మహేందర్, డీడబ్ల్యూవో జయంతి, తహసీల్దార్ విశ్వప్రసాద్, ఎంపీడీవో కుమారస్వామి, ప్రత్యేకాధికారి నర్సయ్య, సర్పంచ్ సురేశ్‌కుమార్, డిప్యూటీ డీఎం హెచ్‌వో సుధీర్, మెడికల్ ఆఫీసర్ శ్రీవాణి, రవిరాథోడ్, సూపర్వైజర్ రమణ, ఏఎన్ఎం ప్రేమలత, అంగన్వాడీ టీచర్లు చింత స్వరూప, రడపాక మాధవి, ఆశ వర్కర్లు మేరిలా, దయామని, యాదలక్ష్మి, శారద పాల్గొన్నారు.
వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు..
లింగాలఘనపురం: వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని మండ ల వైద్యాధికారి కరుణాకర్‌రాజు సూచించారు. మండలంలోని కుందారం, నవాబుపేట, లింగాలఘనపురం, నెల్లుట్ల కుందారం గ్రామాల్లో శనివారం ఇంటింటికీ వెళ్లి వైద్యసిబ్బంది టీకాలను వేశారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం కోట్లాది రూపాయలు కర్చు చేసి టీకాలను తెప్పించి ఉచితంగా అందిస్తోందన్నారు. ప్రజల వద్దకే టీకా కార్యక్రమాన్ని చేపట్టినా కొందరు స్పందించడంలేదన్నారు. అపోమలను వీడి ప్రతి ఒక్కరూ టీకాలను వేయించుకోవాల్నారు. కాగా లింగాలఘనపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వివిధగ్రామాల నుంచి వచ్చిన 33 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్, ఎంపీ వో మల్లికార్జున్, ఏఎన్ఎంలు స్వరూప, రేణుక, రామణి, యశోద తదితరులు పాల్గొన్నారు.